పునర్విభజన..! | - | Sakshi
Sakshi News home page

పునర్విభజన..!

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో నగరాభివృద్ధికి చేసిందేమీ లేదు. డివైడర్లకు రంగులు, మొక్కలు, రకరకాల బొమ్మలు ఏర్పాటు చేసి జేబులు నింపుకున్న అధికార పార్టీ నేతలకు విజయంపై భయం పట్టుకుంది. దీంతో డీ లిమిటేషన్‌ ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకుని గట్టెక్కాలని తెరవెనుక పావులు కదిపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011లో 50 డివిజన్లతో ఒంగోలు కార్పొరేషన్‌ ఏర్పడింది. ప్రస్తుతం నగర జనాభా 3 లక్షలు దాటింది. దీంతో కార్పొరేషన్‌ పరిధిలో డివిజన్ల సంఖ్యను 62కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త డివిజన్లకు హద్దులు నిర్ణయిస్తూ కార్పొరేషన్‌ అధికారులు ఈ నెల 18వ తేదీ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాల కోసం వారం రోజుల గడువిచ్చారు. పైకి చూడ్డానికి ఇక్కడిదాకా బాగానే కనిపిస్తున్నా.. తెరవెనుక కుట్రలు, కుతంత్రాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటమే అందుకు నిరదర్శనంగా నిలుస్తోంది.

నిబంధనలు తుంగలో తొక్కి...

డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఆద్యంతం విమర్శల పాలవుతోంది. డివిజన్ల విభజనలో జనాభా సమానత్వం ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అనివార్యమైతే 10 శాతం వ్యత్యాసం ఉండొచ్చు. భౌతికంగా కూడా ఉత్తర తూర్పు నుంచి ప్రారంభించి క్లాక్‌ వైజ్‌ డైరెక్షన్లో విభజన చేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ జరిగిన డీ లిమిటేషన్‌ ప్రక్రియలో ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. అధికార పార్టీ కీలక నేత చేతిలో కీలు బొమ్మలుగా మారిన అధికారులు.. అడ్డగోలుగా విభజన చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నగరపాలక సంస్థలో గతంలో 50 డివిజన్లు ఉండగా వాటిలో 25 డివిజన్లలో 45 అభ్యంతరాలు వచ్చాయంటే విభజన ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినా అధికారులు కిమ్మనడం లేదు.

డివిజన్ల వారీగా అభ్యంతరాలు ఇవే...

నగరంలోని పాత 50 డివిజన్లలో 8, 11, 13, 14, 18, 9, 10, 48, 49, 38, 44, 45, 5, 6, 37 డివిజన్లలో అత్యధికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. 33వ డివిజన్లో 4600 ఓట్లు ఉన్నాయి. ఇందులోంచి దక్షిణంవైపు ఉన్న ఒడ్డువానికుంటలోని ఎస్సీ, బీసీల ఓట్లను 37వ డివిజన్లోకి చేర్చారు. 18వ డివిజన్లో ఉన్న అగ్రకులాల ఓట్లు తీసుకొచ్చి 33వ డివిజన్లో కలిపారు. తద్వారా 33వ డివిజన్లో ఎస్సీ, బీసీలను దెబ్బతీయాలన్న కుట్ర దాగి ఉందని స్థానికులు మండిపడుతున్నారు. ఎస్సీ, బీసీలకు అధికారాన్ని దూరం చేసి అగ్రకులాలకు పెత్తనం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాత 37వ డివిజన్‌ను మూడు ముక్కలు చేశారు. ఈ డివిజన్‌ను 45, 46, 47లో కలిపారు. అయితే, తలాతోకా లేకుండా ఇష్టారీతిన మార్పులు చేయడంతో ఏ డివిజన్‌ ఎక్కడుందో, వాటి హద్దులేమిటో అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. ఒక వీధిలో ఉన్న నాలుగు ఇళ్లు ఒక డివిజన్లోకి వస్తే.. మరో నాలుగు ఇళ్లు ఇంకో డివిజన్‌ పరిధిలోకి రావడంతో గందరగోళం ఏర్పడింది.

కొప్పోలు నుంచి అగ్రహారాన్ని తీసేసి పెళ్లూరులో కలిపారు. ఉపాస్‌ హాస్పిటల్‌, బచ్చల బాలయ్య కల్యాణ మండపం వెనుక ఉన్న ప్రాంతాన్ని రోడ్డుకు 100 అడుగుల అవతల ఉన్న కబాడీపాలెంలో కలపడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. మూడు డివిజన్లలో ఉన్న ఒకే సామాజికవర్గాన్ని ఒక డివిజన్‌ పరిధిలోకి చేర్చడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

భౌగోళికంగా సంబంధం లేకుండా...

డివిజన్ల మార్పు పిచ్చోడి చేతిలో రాయిలాగా చేశారని పేరు చెప్పడానికి ఇష్టపడని నగరపాలక సంస్థ ఉద్యోగులు కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. పరిపాలనాపరంగా కూడా సంబంధం లేకుండా విభజన చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సచివాలయం, మంచినీరు, రేషన్‌, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలతో సంబంధం లేకుండా కొందరు ఓటర్లను దూరప్రాంతాలకు బదిలీ చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్పుల వెనుక సామాజిక వివక్ష, రాజకీయ లబ్ధి దాగున్నాయని నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ అభ్యంతరం తెలిపారు.

సంతనూతలపాడులో పెరగని డివిజన్లు...

ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలో ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి 5 డివిజన్లు ఉన్నాయి. అయితే, ఈ 5 డివిజన్ల పరిధిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవడంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గం కావడంతో చిన్నచూపు చూస్తున్నారని టీడీపీకి చెందిన కొందరు ఎస్సీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధన 5 ప్రకారం వార్డుల విభజన ప్రక్రియలో కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని వార్డుల మధ్య జనాభా సమానత్వం ఉండాలి. ఆ నిబంధన ప్రకారం సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలో మరో రెండు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానిక నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇది అధికార పార్టీకి లబ్ధి కలిగించే విభజన

నగరంలో జరిగిన డివిజన్ల విభజన కేవలం అధికార పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు చేపట్టిన ప్రక్రియలాగా ఉంది. ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందించేలా లేదు. నగరంలో జరిగిన విభజనలో అనేక లోపాలున్నాయి. చట్టపరంగా ఉల్లంఘనలు ఉన్నాయి. రూల్‌ 4 ప్రకారం సహజ సరిహద్దులు లేవు. రూల్‌ 5 ప్రకారం వార్డుల మధ్య జనాభా సమానత్వం లేదు. రూల్‌ 6, 7 ప్రకారం శాస్త్రియంగా విభజన జరగలేదు. ఎస్సీ, బీసీ, మైనారిటీలను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలు కనిపిస్తున్నాయి.

– ఇమ్రాన్‌ఖాన్‌, నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్‌ లీడర్‌

Advertisement
 
Advertisement
Advertisement