మోదీ పాలనలో విధ్వంసకర చర్యలు | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలో విధ్వంసకర చర్యలు

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

ఆగస్టు 6 నుంచి 15 వరకూ పాదయాత్రలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

మార్కాపురం: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాలనలో విధ్వంసకర చర్యలు సాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య అన్నారు. మార్కాపురం పట్టణంలోని ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ పుష్కర కాలంలో అనేక విధ్వంసకర సంఘటనలు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్లాక్‌మార్కెట్‌ విస్తరిస్తున్నా ప్రభుత్వం నియంత్రించలేదని అన్నారు. దేశంలో రూపాయి విలువ పడిపోవడం, విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినడం, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ఆయిల్‌ ధరలు తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తున్న పొదుపు చర్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత పొదుపు సాధించిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 6 నుంచి 15 వరకూ పాదయాత్రలు నిర్వహించాలని సీపీఐ నిర్ణయించినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 28న భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి అల్టి మేటం ఇస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ, సీనియర్‌ నాయకులు అందె నాసరయ్య, ఎస్‌కే ఖాశీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement