కనిగిరి రూరల్/బల్లికురవ/త్రిపురాంతకం:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల ధాటికి పొగాకు బ్యారన్లు, గోడౌన్లు కుప్పకూలడంతో కనిగిరి మండలం చాకిరాలలో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. కుందురు రమణారెడ్డికి చెందిన 4 బ్యారన్ల పైకప్పు గాలికి ఎగిరిపోవడంతో రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లింది. దున్నేటి రమేష్‌కు చెందిన బ్యారన్ రేకులు విరిగిపోయి, పొగాకు గోడౌన్ దెబ్బతిని సుమారు 10 లక్షల వరకు నష్టం జరగ్గా, కేశినేని నారాయణకు చెందిన పొగాకు గోడౌన్ పూర్తిగా కూలడంతో సుమారు 100 పొగాకు బేళ్లు పూర్తిగా దెబ్బతిని రూ.15 లక్షల మేర నష్టపోయారు. పొగాకు బోర్డు సూపరింటెండెంట్ సుధీర్, వీఆర్వో రవి శుక్రవారం చాకిరాలలో దెబ్బతిన్న బ్యారన్లు, పొగాకు గోడౌన్లను పరిశీలించారు. నష్టం అంచనాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కాగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. పెనుగాలుల బీభత్సానికి కనిగిరి విద్యుత్ డివిజన్ పరిధిలోని వెలిగండ్లలో 30, పీసీపల్లిలో 30, హెచ్‌ఎంపాడులో 7, కనిగిరి రూరల్ ఏరియాలో సుమారు 20 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని ఆ శాఖ ఈఈ ఆర్.ఉమాకాంత్ వెల్లడించారు.
● బల్లికురవ మండలంలోని సుమారు 12 గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బోర్ల కింద 130 ఎకరాల్లో సాగు చేసిన అరటి బొప్పాయి, మామిడి, జామ, నిమ్మ తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అరటి చెట్లు నేలవాలడంతోపాటు మామిడి, జామ, బొప్పాయి, నిమ్మకాయలు రాలిపోవడంతో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
● త్రిపురాంతకం మండలం అన్నసముద్రంలో 10 రేకుల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మేడపి, గణపవరం గ్రామాలలోనూ పదుల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూలి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. హైవేపై చెట్టు కూలడంతో దానిని తప్పించే క్రమంలో మినీ వ్యాన్ బోల్తా పడింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలానికి చెందిన ఓ కుటుంబం శ్రీశైలం వెళ్లి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఆరుగురు స్వల్పంగా గాయపడగా, బాలిరెడ్డి అనే వృద్ధుడు మృతి చెందాడు.
చాకిరాలలో పూర్తిగా కూలిన పొగాకు గోడౌన్
వల్లాపల్లిలో నేలవాలిన అరటి తోట


