మార్కాపురం టౌన్: జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గోవులను వధించేందుకు సిద్ధంగా ఉంచారన్న సమాచారం తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాల నాయకులు, పోలీసులు శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని గోవులను కాపాడారు. పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోవధ చేయవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు గురు, శుక్ర వారాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గోవులను కొనుగోలు చేసి మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులోని కమ్యూనిస్టు కాలనీ, కాలేజీ రోడ్డులోని ఎస్సీపాలెంలోని షెడ్డుల్లో ఉంచారు. శుక్రవారం ఉదయం ఈ విషయం హిందూ ధార్మిక సంఘాలు, బీజేపీ నాయకులకు తెలియడంతో వారు ఆ ప్రాంతానికి వెళ్లి నిర్వాహకులతో వాదనలకు దిగారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కొంతమంది అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో రెండు ప్రాంతాల్లో గోవులను వధిస్తున్నారన్న సమాచారం రావడంతో అక్కడికి వచ్చామన్నారు. అప్పటికే గురు, శుక్రవారాల్లో సుమారు 40 గోవులను వధించి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేశారని చెప్పారు. ఎక్స్‌పోర్టుకు సిద్ధంగా ఉన్న బాక్సులను మున్సిపల్ అధికారులు గుర్తించి వాటి మాంసాన్ని ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి పూడ్చివేశారు. మరో 60 గోవులను రక్షించి గోశాలలో సురక్షితంగా ఉంచారు.
మార్కాపురంలో 40 గోవులు
వధించి ఎగుమతికి సిద్ధం
60 గోవులను రక్షించిన ధార్మిక
సంఘాల నాయకులు
పోలీసుల అదుపులో నిందితులు


