మహిళల భద్రతకు ఆపరేషన్‌ దండాయన | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు ఆపరేషన్‌ దండాయన

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

మహిళల భద్రతకు ఆపరేషన్‌ దండాయన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జనగణనలో పొరపాట్లకు తావివ్వద్దు ఐదుగురు జూదరులు అరెస్టు

ఒంగోలు టౌన్‌: మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ఆపరేషన్‌ దండాయనను ప్రారంభించినట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. మహిళలపై నేరాల్లో సత్వర విచారణ, కఠిన శిక్షలు, నేరస్తుల కదలికలపై నిఘా పెట్టడం ఈ ఆపరేషన్‌ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు కేసులు బదిలీ చేసి శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బాధిత మహిళలకు కౌన్సెలింగ్‌, న్యాయ సహాయం, పునరావృత నేరస్తులు, అనుమానితులపై సెక్యూర్‌ ఆంధ్ర సిస్టమ్‌ ద్వారా నిఘా ఉంచడం ఆపరేషన్‌ దండాయనలో భాగమని చెప్పారు.

త్రుటిలో తప్పిన ముప్పు

అద్దంకి: మండలంలోని శింగరకొండపాలెం సమీపంలో అద్దంకి కొండకు ఉత్తర భాగంలో ఉన్న 132/కేవీ సబ్‌ స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈదురు గాలుల ధాటికి సబ్‌ స్టేషన్‌ ఆవరణలో విద్యుత్‌ తీగల నుంచి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది శ్రమించి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: జనగణన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దని సెన్సస్‌–2027 సంబంధిత అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ పి.రాజాబాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. పథకాల అమలులో సంతృప్త స్థాయి పెరగాలని చెప్పారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, గ్రీవెన్స్‌ అర్జీల పరిష్కారంలో పురోగతి, భూముల రీ సర్వే, స్కూల్‌ ఎన్‌రోల్‌మెంట్‌, పీఎం కుసుం, పీఎం సూర్యఘర్‌, పెన్షన్‌న్ల పంపిణీ, హౌసింగ్‌ ప్రోగ్రాం, జలధార–జలహారతి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

దొనకొండ: మండలంలోని కొచ్చెర్లకోట శివారులో కోడి పందేల శిబిరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఐదుగురు జూదరులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.12,090 నగదు, 5 బైకులు, 5 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎల్‌.రామకృష్ణ చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement