కురిచేడు: జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సాగర్ జలాలు విడుదల చేసినట్లు ఎన్‌ఎస్పీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్బర్‌బాషా తెలిపారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా రామతీర్థం రిజర్వాయర్, ఒంగోలు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు విడుదల చేసిన సాగర్ జలాలు శుక్రవారం రాత్రి ప్రధాన కాలువ 126వ మైలు వద్దకు చేరాయి. దర్శి బ్రాంచ్ కెనాల్ ద్వారా ఒంగోలు బ్రాంచ్‌కు శనివారం సాగర్ జలాలు చేరనున్నాయని డీఈఈ చెప్పారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాగర్ జలాలను కేవలం తాగునీటి చెరువులు నింపేందుకే వినియోగించాలన్నారు. ఎక్కడైనా నీటి చౌర్యం జరిగినట్లు తెలిసినా, చేపల చెరువులకు నీటిని మళ్లించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


