పొన్నలూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు భూ ఆక్రమణలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఏ భూమైనా పర్వాలేదు ఆక్రమించేద్దాం.. అక్రమ కట్టడాలు నిర్మిద్దాం, అవసరమైతే అమ్ముకుందాం అనే పద్ధతిని పాటిస్తూ యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు కబ్జాదారులుగా మారి జెండా పాతేస్తున్నారు. స్థానికులు అడ్డు తగులుతూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా అవేవి మాకు వర్తించవంటూ నియోజకవర్గ ముఖ్య నేతల అండదండలతో అధికారులను, స్థానికులను బెదిరిస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన వారంతా ప్రేక్షకపాత్ర వహించడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. మండలంలోని చెరుకూరు రెవెన్యూ పరిధి తిమ్మపాలెం గ్రామంలో సర్వే నంబర్ 737/1 లో 1.14 ఎకరాల ప్రభుత్వ బండి బాట స్థలం ఉంది. ఈ స్థలం గ్రామానికి సమీపంలో ఉండి కట్టడాలకు అనువుగా ఉండటంతో స్థానిక టీడీపీ సానుభూతిపరుల కన్ను బండిబాట స్థలంపై పడింది. వాస్తవంగా 2018 గత టీడీపీ ప్రభుత్వ నుంచే తమ్ముళ్లు విడతల వారీగా స్థలాన్ని ఆక్రమిస్తూ బ్యారన్‌ల నిర్మాణాలకు పూనుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు 2022లో హైకోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆక్రమితదారులకు నోటీసులు ఇచ్చారు. అయితే పంచాయతీ అధికారులు బండి బాట స్థలాన్ని పొరపాటున వాగుపోరంబోకు భూమి అని కోర్టుకు తెల్పడంతో కొంత సందిగ్ధత ఏర్పండి. దీంతో మరోసారి రికార్డులు పరిశీలించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేసి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. అయితే పంచాయతీ అధికారులకు నేటి వరకు ఆక్రమితదారులకు నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు.
స్థలం విలువ రూ.కోట్లలోనే
2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు బండిబాట స్థలంలో అక్రమంగా బ్యారన్‌ల నిర్మాణానికి ముందుకొచ్చారు. ప్రభుత్వ బండిబాట స్థలం గ్రామానికి సమీపంలో ఉండటంతో సెంటు స్థలం రూ.2 లక్షల ధర పలుకుతోంది. ఈ చొప్పున 1.14 ఎకరాల స్థలం ధర సుమారుగా రూ.2.28 కోట్లు వరకు ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. విడతల వారీ గా తెలుగు తమ్ముళ్లు బండిబాట స్థలాన్ని ఆక్రమించి సుమారుగా 10 బ్యారన్లు వరకు నిర్మించారు.
దొంగ పత్రంతో బ్యారన్ లెక్క...
ప్రభుత్వ బండి బాట స్థలం ఆక్రమించి తమ్ముళ్లు పొగాకు బ్యారన్లు నిర్మించడమే కాకుండా అక్రమ నిర్మాణాలకు దొంగ పత్రాలు సృష్టించారు. అక్రమ పొగాకు బ్యారన్ నిర్మాణానికి స్థానిక వీఆర్వో అధికారకంగా అనుమతి పత్రం ఇచ్చినట్లు దొంగ పత్రం సృష్టించి పొగాకు బోర్డు అధికారులకు అందజేశారు. దీంతో దొంగ పత్రం ఆధారంగా పొగాకు బోర్డు వారు సంబంధిత ఆక్రమితదారులకు పొగాకును విక్రయించడానికి బ్యారన్ లెక్క కూడా కల్పించారు. అయితే దీనిపై సంబంధిత వీఆర్వోని గ్రామస్తులు ప్రశ్నించగా తనకు తెలియదని, అనుమతి పత్రం నేను మంజూరు చేయలేదని తెలియజేయడం గమనార్హం. అలాగే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన బ్యారన్‌లకు ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడం కొసమెరుపు. బ్యారన్‌లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని కూడా గ్రామస్తులు రాకపోకలు సాగించే రోడ్డులో నిర్మించడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయి.
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం...
వాస్తవంగా తిమ్మపాలెం గ్రామంలో విలువ కలిగి ప్రభుత్వ బండిబాట స్థలం ఆక్రమణపై రెవెన్యూ, పంచాయతీ అధికారులకు గ్రామస్తులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం. తమకు ఇవేమి పట్టవంటూ పట్టీపట్టనట్లు వ్యవహిస్తున్నారు. ఆక్రమితదారుల దగ్గర ముడుపులు తీసుకోవడం వలనే రెవెన్యూ, పంచాయతీ అధికారులు అటువైపు కూడా చూడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. అయితే మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు కందుకూరు సబ్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ బండిబాట స్థలంలోని ఆక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తిమ్మపాలెంలో తెలుగు తమ్ముళ్ల ఆక్రమణల పర్వం
1.14 ఎకరాల ప్రభుత్వ బండిబాట స్థలం ఆక్రమణ
మార్కెట్‌లో బండిబాట స్థలం విలువ సుమారుగా రూ.2.28 కోట్లు
ఆక్రమించిన స్థలంలో 10 పొగాకు బ్యారన్‌ల నిర్మాణం
దొంగ పత్రాలతో పొగాకు బ్యారన్ లెక్క సైతం తెచ్చుకున్న వైనం
బ్యారన్‌లకు అక్రమ విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన ఆ శాఖ సిబ్బంది
పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ, పంచాయతీ అధికారులు


