అసమర్ధ కూటమి పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలనలోఒక్క కొత్త పరిశ్రమ రాలేదు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దిన వేడుకలు
ఒంగోలు టౌన్:
రెండేళ్ల చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు మళ్లీ జగనన్న పాలన రావాలని కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులు వేడుకల్లో పాల్గొని కేక్‌లు కట్ చేసి, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సభకు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది కార్యకర్తల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎత్తిన జెండా దించకుండా జగనన్నకు వెన్నుదన్నుగా నిలబడి కలబడిన కార్యకర్తల రుణం తీర్చుకోలేమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధించిందని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా అదరక, బెదరక పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. కూటమి పదవులకు, ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవంతో ముందుకు సాగిన కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి అకాల మరణం తరువాత ప్రజలను పట్టించుకునేవారే లేకుండా పోయిన పరిస్థితుల్లో జననేత జగనన్న వైఎస్సార్ సీపీ పెట్టారని గుర్తు చేశారు. గత 16 ఏళ్లుగా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగనన్నదన్నారు. నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా వెన్ను చూపకుండా ముందుకు సాగిన దమ్ము, ధైర్యం కలిగిన నాయకుడు జగనన్న అని కొనియాడారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం, రైతు భరోసా, సచివాలయాలు వంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేసిందని తెలిపారు. నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆరోగ్య శ్రీ అమలు చేసిందని నేడు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వాటిని అటకెక్కించారని విమర్శించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పాలకులు ఎన్ని కేసులు పెట్టినా, 16 నెలలు జైలుకు పంపించినా భయపడకుండా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడిన దమ్మున్న నాయకుడు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని, ఎల్లకాలం ఇదే పరిపాలన కొనసాగదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుందామని, అప్పటి వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు.


