దర్శిలో తీగలాగితే హైదరాబాద్‌లో కదిలిన భారీ డొంక పోలీసుల అదుపులో ప్రధాన బుకీ బెట్టింగ్ ముఠాకు కోలుకోని దెబ్బ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్ ముఠాకు భారీ దెబ్బ తగిలింది. దర్శిలో తీగలాగితే నరసరావుపేట, హైదరాబాద్‌లో డొంక కదిలింది. ఫిబ్రవరి 26వ తేదీన ‘బెట్టింగ్ మామూళ్లే’ అనే శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఎస్పీ హర్షవర్థన రాజు సీరియస్‌గా తీసుకున్నారు. అప్పుడే జిల్లా పోలీసు అధికారులకు క్లాస్ పీకారు. బెట్టింగ్ ముఠా అంతు చూడాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిల్లా వ్యాప్తంగా హడావుడి చేసిన పోలీసు యంత్రాంగం నామ మాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. అయినా ఎస్పీ ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. ఈ క్రమంలో టీ 20 ఫైనల్ జరుగుతున్న రోజు దర్శిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక పోస్టల్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని మూడు రోజుల పాటు విచారణ చేసి కూపీ లాగారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు దర్శి పోలీసులు నామ మాత్రంగా కేసు పెట్టి పోస్టల్ ఉద్యోగిని వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ కేసును టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌పోర్స్ పోలీసులు నరసరావుపేటకు చెందిన ప్రధాన బుకీని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. అతడి వద్ద బెట్టింగుకు సంబంధించిన బోర్డు, పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు లభించినట్లు సమాచారం. అతడి వద్ద నుంచి బెట్టింగుకు సంబంధించిన రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట బుకీని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా హైదరాబాద్‌లో మరో ప్రధాన బుకీ ఉన్నట్లు సమాచారం వచ్చింది. దాంతో అతడిపై నిఘా పెట్టిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ బుకీ నుంచి రాబట్టిన సమాచారం మేరకు కడప, గుంటూరులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ బుకీలను ఏర్పాటు చేసుకొని కోట్లాది రూపాయల బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు బిత్తరపోయారు. సినిమా తరహాలో ఏర్పాటు చేసుకున్న సెట్టింగులు చూసి విస్మయానికి గురయ్యారు. లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు నేడో రేపో హైదరాబాద్ బుకీని అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బుకీ అరెస్టుతో రాష్ట్రంలో ఒక పెద్ద బెట్టింగ్ ముఠా ఆటకట్టయినట్లేనని పోలీసు అధికారులు చెబుతున్నారు.


