మార్కాపురం టౌన్: రూర్బన్ పంచాయతీల పేరుతో పేదల పొట్ట కొట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి సుస్థిరత సమావేశం కే మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూర్బన్ పంచాయతీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానం చేయడంతో ఉపాధి పథకం ఆ గ్రామాల్లో రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 10 వేల జనాభా ఉన్న గ్రామాలను రూర్బన్ (రూరల్ అర్బన్) పేరుతో పంచాయతీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గ్రామాలకు పట్టణ సౌకర్యాలు కల్పించడం మంచిదే అయినా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టం ఆ గ్రామాల్లో అమలు చేస్తారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రాంతాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేసిన సందర్భాల్లో నగర పంచాయతీలుగా మార్చిన సందర్భంలోనూ పేదలు ఉపాధి హామీ చట్టాన్ని కోల్పోయారని అన్నారు. రూర్బన్ పద్ధతిలో అటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణాలు చూపి గృహ వినియోగదారుల వంట గ్యాస్ సిలిండరుకు రూ.60, వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ రూ.11 పెంచడం అన్యాయమని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని గ్యాస్ సిలిండర్ల సరఫరా సంస్థలు సిలిండర్లను బ్లాక్‌చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ప్రకటించిన పథకాలు అమలులోకి రాలేదని, ప్రభుత్వం పథకాలపై స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం మార్కాపురం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కే మాల్యాద్రి, కార్యదర్శిగా గుమ్మా బాలనాగయ్య, ఉపాధ్యక్షులుగా కే వెంకటమ్మ, సహాయ కార్యదర్శులుగా ఏడుకొండలు, బీ రత్నంతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు డీకేఎం రఫీ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు, కార్మికులు పాల్గొన్నారు.


