చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో 2 గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పెద్దదోర్నాల: తమను శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ కర్నాటక, రాజస్థాన్‌కు చెందిన చిరు వ్యాపారులు శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్‌పోస్టు వద్ద రోడ్లపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గణపతి చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్‌కు గంట పాటు అంతరాయం ఏర్పడింది. శ్రీశైల దేవస్థానం అధికారుల ఆదేశాల మేరకు కొద్ది రోజులుగా చిరు వ్యాపారులను గణపతి చెక్‌పోస్టు వద్ద నిలిపేస్తున్నారు. దీంతో వారు మండల కేంద్రంలోని రహదారుల వెంట వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వారికి అనుకున్నంతగా వ్యాపారాలు జరగకపోవటంతో వారు తొలుత అటవీశాఖ కార్యాలయం వద్ద చేరుకుని, అనంతరం గణపతి చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు రాస్తారోకో నిర్వహించి తమను శ్రీశైలానికి అనుమతించాలని ఆందోళన నిర్వహించారు. దీంతో పాటు శ్రీశైలానికి ప్రయాణాలు సాగిస్తున్న కన్నడ భక్తులు కూడా వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో అటవీశాఖ అధికారులు దేవస్థానం అధికారులతో మాట్లాడి ఆందోళన చేస్తున్న వారిని శ్రీశైలానికి అనుమతించటంతో గొడవ సద్దుమణిగింది. ఈ ధర్నాతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవటంతో 2 గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
గణపతి చెక్‌పోస్టు వద్ద ఆందోళన చేస్తున్న చిరు వ్యాపారులు
ఆందోళనతో నిలిచిన వాహనాల రాకపోకలు


