సొంత నిధులతో మెటల్ రోడ్డు
● రూ.3 లక్షలు వెచ్చిస్తున్న చాపలమడుగు సర్పంచ్
పుల్లలచెరువు: మండలంలోని చాపలమడుగు పంచాయతీలోని సి.కొత్తపల్లి గ్రామానికి రహదారి సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని గ్రామానికి చెందిన కొందరు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ టి.సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులు రూ.3 లక్షలు వెచ్చించి మెటల్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. బుధవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రహదారి కోసం 600 ట్రాక్టర్ల గ్రావెల్ వినియోగిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే, సర్పంచ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మల్లాపాలెం సర్పంచ్ ఆవుల రమణారెడ్డి, నాయకులు లింగం రవి, సంపతి, చిన్న ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.


