ఏయ్ బయటకు వెళ్లు.. లేదా సంతకం పెట్టి మాట్లాడు
పుల్లలచెరువు: ‘సంతకం పెట్టి మాట్లాడు, బయట ఉండి మాట్లాడతావేంటి, ముందు బయటకు వెళ్లి మాట్లాడు’ అంటూ ఎంపీటీసీ సభ్యుడు, మండల ఉపాధ్యక్షుడు ఎల్.రాములుపై ఎంపీడీఓ మరియదాసు నోరుపారేసుకున్నారు. బుధవారం ఎంపీపీ అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంది. కోరం లేకుండా సమావేశం నిర్వహించేందుకు ఎంపీడీఓ సిద్ధం కావడంతో ఎంపీటీసీ సభ్యుడు రాములు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఎంపీడీఓ ఇష్టారీతిగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. కోరం ఎక్కడుందో చూపండి అని ఎంపీటీసీ కోరగా.. ‘ముందు బయటకు వెళ్లు, లేదా సంతకం పెట్టి సభలో ఉండు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతాం. అంతే కానీ సంతకం పెట్టకుండా మాట్లాడకు, ముందు కార్యాలయం నుంచి బయటకు వెళ్లు’ అని ఎంపీడీఓ దురుసుగా మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎంపీడీఓ తీరు పచ్చ కండువా కప్పుకొన్న రాజకీయ నాయకుడిలా ఉందని అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే అక్కడికి పోలీసులు చేరుకోవడం, రైతుల ఇబ్బందులపై సభ్యులు, విలేకర్లు ప్రశ్నిస్తుండగా పోలీసులు వారించడంతో సమావేశం రసాభాసగా మారింది. కోరం లేకుండా, ముఖ్య శాఖల అధికారులు పాల్గొనకుండానే సభ నిర్వహించి మమ అనిపించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చ ఆవగింజంతైనా అవకాశం లేకుండా ఎంపీడీఓ ఇష్టానుసారం వ్యవహరించారని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఎంపీడీఓ వ్యవహార శైలిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీటీసీ సభ్యుడు ఎల్.రాములు తెలిపారు. ఇదిలా ఉండగా సర్వసభ్య సమావేశంలో బయట వ్యక్తులు దర్జాగా పాల్గొనడం కొసమెరుపు.
పుల్లలచెరువు ఎంపీడీఓ మరియదాసు నోటి దురుసు
ఎంపీటీసీ సభ్యుడు రాములుపై దుర్భాష
కోరం లేకుండానే సమావేశం నిర్వహణ


