స్టడీ.. రెడీ!
మార్కాపురం జిల్లాలో హైస్కూళ్లు 197 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు 28,000
పదో తరగతిలో మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం ఉన్న గణతం సబ్జెక్టుపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 100 రోజుల ప్రణాళికను ఉపాధ్యాయులు కచ్చితంగా అనుసరించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలే విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. సులువుగా ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉన్న సబ్జెక్టులకు ఎక్కువ సమయం, కష్టమైన సబ్జెక్టులకు తక్కువ సమయం ఇవ్వడంతో విద్యార్థులు మదనపడుతున్నారు. విద్యాశాఖ ఆదేశాలను ధిక్కరిస్తే చిక్కులు తప్పవని భావించిన ఉపాధ్యాయులు కిమ్మనడం లేదు. గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల ప్రిపరేషన్‌పై విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందుతున్నారు. మంచి స్కోర్ వచ్చే ఈ రెండు సబ్జెక్టులకు 100 రోజుల ప్రణాళికలో తక్కువ సమయం కేటాయించడంపై విద్యాశాఖ అధికారులు పునరాలోచన చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
మార్కాపురం: విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. విద్యార్థుల బంగారు భవితకు పునాది వేసి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తొలిమెట్టు లాంటిది. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలకు ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించింది. యాక్షన్ ప్లాన్ ప్రారంభమై 60 రోజులు గడిచిపోయాయి. పరీక్షలకు మరో 40 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో 197 హైస్కూళ్ల నుంచి దాదాపు 28 వేల మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే విద్యార్ధులు స్టడీ అవర్స్‌లో కుస్తీలు పడుతున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో సిలబస్ ఇంకా కొనసాగుతోంది. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం కోసం ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక స్టడీ అవర్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను దత్తత తీసుకుని వెనుకబడిన సబ్జెక్టుల్లో సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అసెస్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
షైనింగ్, రైజింగ్ స్టార్స్‌గా విభజన
ప్రతి పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్‌గా విభజించారు. చదువులో ముందుండే వారిని షైనింగ్ స్టార్లుగా పేర్కాన్న విద్యాశాఖ వారిపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక మార్కులు సాధించేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిని రైజింగ్ స్టార్స్‌గా పేర్కొంటూ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించేలా పాఠ్యాంశాలు బోధించాలని సూచించింది.
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు కుస్తీ పడుతున్న విద్యార్థులు
సర్కారు 100 రోజుల ప్రణాళికలో లోపాలు
సబెక్టులకు కేటాయించిన సమయంపై ఆందోళన
కొన్ని పాఠశాలల్లో ఇంకా పూర్తి కాని సిలబస్


