పన్ను వసూలు చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూలు చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌

Feb 5 2026 7:20 AM | Updated on Feb 5 2026 7:20 AM

పన్ను

పన్ను వసూలు చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌

పన్ను వసూలు చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌ గూడ్స్‌ రైలు ఢీకొని ఒకరు మృతి లారీ కింద పడి వృద్ధురాలు మృతి నీళ్ల ట్యాంకర్‌ ఢీకొని ఒకరు మృతి పొగాకు పందిరి దగ్ధం 2.6 కేజీల గంజాయి స్వాధీనం

చీమకుర్తి రూరల్‌: మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామ సచివాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న శ్యామ్‌పై జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. హౌస్‌ టాక్స్‌ సక్రమంగా వసూలు చేయడం లేదనే కారణంతో సస్పెండ్‌ చేస్తూ డీపీఓ వెంకటేశ్వరావు ఉత్తర్వులు ఇచ్చారని ఎంపీడీఓ రాఘేంద్ర తెలిపారు.

గిద్దలూరు(బేస్తవారిపేట): స్థానిక నంద్యాల రోడ్డులోని సగిలేరు రైల్వే వంతెనపై గూడ్స్‌ రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెకు చెందిన జంగం రమణారెడ్డి(45) భార్యతో విభేదాల నేపథ్యంలో ఒంటరిగా తల్లి వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి సగిలేరు వాగు వంతెన మీద రైల్వే ట్రాక్‌పై సెల్‌ఫోన్‌ చూస్తున్నాడు. అదే సమయంలో గూడ్స్‌ ట్రైన్‌ ఢీకొనడంతో వంతెన నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే ట్రాక్‌ తనిఖీ చేస్తున్న ట్రాక్‌మన్‌ మద్దిలేటి వంతెన కింద ఒకరు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మేదరమెట్ల: లారీ కింద కిందపడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గురువారం మేదరమెట్లలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(65) కూరగాయలు, సరుకులు కొనుగోలు చేసేందుకు మెయిన్‌ సెంటర్‌కు వెళ్తుండగా, అదే సమయంలో మలుపు తిరుగుతున్న కంటైనర్‌ లారీ వెనుక భాగం ఆమెను ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కింద వృద్ధురాలు పడిపోవడంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రురాలిని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్దిపాడు: నీళ్ల ట్యాంకర్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి సర్వీస్‌ రోడ్డులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. గుండ్లాపల్లి గ్రామానికి చెందిన సాదినేని ఆంజనేయులు(59) మోటారుసైకిల్‌పై గుండ్లాపల్లి ఫ్లైఓవర్‌ సర్వీసు రోడ్డులోకి వస్తుండగా వెనుక నుంచి కల్యాణి ఆక్వా సంస్థకు చెందిన నీళ్ల ట్యాంకర్‌ ఢీకొట్టింది. ట్యాంకర్‌ వెనుక టైరు కింద పడిపోవడంతో ఆంజనేయులు తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మద్దిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రూ.5 లక్షల మేర నష్టం

యర్రగొండపాలెం: మండలంలోని పందివానిపల్లె గ్రామంలో పొగాకు పందిరికి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో దాదాపు రూ 5 లక్షల రూపాయల విలువైన 30 క్వింటాళ్ల పొగాకు దగ్ధమైంది. ఉద్దేశపూర్వకంగా తన పొగాకును తగలబెట్టారని బాధిత రైతు మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

టంగుటూరు: పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద బుధవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ఇద్దరు వ్యక్తులు రాజమండ్రి నుంచి సింగరాయకొండకు సుమారు 2.6 కేజీల గంజాయిని రైలు మార్గం ద్వారా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఈగల్‌ టీం సీఐ సుధాకర్‌, ఎస్సై సుదర్శన్‌ మాటు వేశారు. ఇద్దరు వ్యక్తులు సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గాన వచ్చి టోల్‌ ప్లాజా వద్ద మార్పిడి చేస్తున్న సమయంలో ఈగల్‌ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని టంగుటూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం.

పన్ను వసూలు  చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌ 
1
1/2

పన్ను వసూలు చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌

పన్ను వసూలు  చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌ 
2
2/2

పన్ను వసూలు చేయలేదని వీడీఓ సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement