సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెలో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ కార్మికలోకం ఎన్నో త్యాగాలతో సాఽధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని తెలిపారు. దానికి అనుబంధంగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఆంక్షలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోకి దిగుమతి చేయడానికి మోడీ ప్రభుత్వం అనుమతిచ్చిందని, అసలే సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగానికి ఇది ఆత్మహత్య వంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ కూలీలకు బతుకు దుర్భరం అవుతుందని, తీవ్ర ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. కనీస మద్దతు ధరల చట్టం చేయకపోతే రానున్న రోజుల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని చెప్పారు. కాస్తో కూస్తో గ్రామీణ పేదల జీవనోపాధికి ఉపయోగపడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు మద్దతు తెలపడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను కాపాడుకోవడానికి సార్వత్రిక సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. సమావేశంలో తన్నీరు సుజాత, కంకణాల వెంకటేశ్వర్లు, బాలనాగయ్య, కేజీ మస్తాన్, మోజెస్, కొమ్మాలపాటి మాల్యాద్రి, ఉబ్బ వెంకటేశ్వర్లు, బడుగు జనార్ధన్, తురక ఏడుకోండలు, జి.రాములు పాల్గొన్నారు.


