ప్రమాదాల నివారణకు సేఫ్టీ బృందాలు
రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం ఎస్పీ హర్షవర్థన్ రాజు వెల్లడి
ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 34 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బృందాల వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లా నుంచి వెళ్లే ఏడు జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను మరింత సురక్షితం చేయడానికి రోడ్డు సేఫ్టీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్–16కు 8 టీంలు, ఎన్‌హెచ్ 544డీ 8 టీంలు, ఎన్‌హెచ్ 765కు 2 టీంలు, ఎన్‌హెచ్ 165బీ 5 టీంలు, ఎన్‌హెచ్ 216 కు 2 టీంలు, ఎన్‌హెచ్ 565కు 8 టీంలు, ఎన్‌హెచ్‌సి ఒక టీం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సేఫ్టీ టీంలో నేషనల్ హైవే అధికారులు, 1033 సిబ్బంది, టోల్‌ప్లాజా సిబ్బంది, ఆర్టీఏ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, 108 అధికారులు, సిబ్బంది సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు, బస్సులు, లారీలు నిలిపే రెస్ట్ ప్రదేశాలు, ఎమెర్జన్సీ పార్కింగ్ ప్రదేశాలు, అనధికార పార్కింగ్ ప్రదేశాలు, బ్లాక్ స్పాట్లు, సర్వీసు రోడ్ల నుంచి ప్రధాన రహదారికి అనుసంధానమయ్యే ప్రాంతాలు, నేరుగా ఉన్న 5 కిలోమీటర్ల వరకు వున్న రోడ్డుపై అతివేగం నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు స్పష్టమైన అదేశాలు ఇచ్చారు. సీసీ కెమెరాలు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, కాన్వెక్స్ మిర్రర్లు, తగినంత లైటింగ్, రంబుల్ స్ట్రీప్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్వీస్ రోడ్లు కలిసే ప్రాంతాల వద్ద ఇసుక డ్రమ్ములు, స్పీడ్ బ్రేకర్లు, ఇల్యూమిషన్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు.


