
ఖాకీ అరాచకమై..
పచ్చనేతల కనుసన్నల్లో ఖాకీల అరాచకాలు ఉదయం పసుపుగల్లులో వైఎస్సార్‌సీపీ నేత దుకాణం కూల్చివేత కోర్టులో ఉన్నా రాత్రి కొండపిలో రచ్చబండ కూల్చివేత ఇదేమిటని ప్రశ్నించిన వారిపై లాఠీలతో దాడి గన్ చూపిస్తూ కాల్చేస్తానని సీఐ బెదిరింపు కొండపి మండలం జాళ్లపాలెంలో పోలీసుల దాష్టీకం మహిళలకు తీవ్రగాయాలు పోలీసుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
చట్టం చుట్టమై..
సివిల్ వివాదాల్లో తలదూరుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన
ఒంగోలు, టాస్క్‌ఫోర్స్: తెల్లవారితే వినాయక చవితి పండుగ. మరో పక్క గ్రామంలో ఒక మహిళ పాము కాటుతో మరణించింది. కొండపి మండలం జాళ్లపాలెంలో మంగళవారం కొందరు గ్రామస్తులు పండుగ ఏర్పాట్లలో నిమగ్నం కాగా, మహిళ చనిపోయిన బాధలో కొంత మంది ఉన్నారు. ఈ క్రమంలో కోర్టు పరిధిలో ఉన్న గ్రామంలోని రచ్చబండను పక్కా ప్రణాళికతో సీఐ సోమశేఖర్ తొలగించేందుకు పథకం రచించారు. ఆమేరకు ఎస్సై ప్రేమ్‌కుమార్ సాయంత్రం ఆరు గంటలకు గ్రామానికి వచ్చి మొదట గత నెలలో రచ్చబండ తొలగింపులో అడ్డుపడిన 10 మంది మహిళలపై కేసులు ఉన్నాయని, వారందరూ పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. దీంతో మహిళలు గ్రామంలో పాముకాటుతో మనిషి చనిపోయింది రేపు వస్తామని చెప్పారు. అయినా మీరు రావాల్సిందేనని పట్టుబట్టడంతో జీపులో తీసుకెళ్లమని మహిళలు చెప్పడంతో మీరు జీపులో కాదు ఆటోలో రావాలని ఆదేశించారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి వచ్చిన సీఐ సోమశేఖర్ 10 మంది మహిళా పోలీసులతో కలిపి దాదాపు 30 మంది కానిస్టేబుల్స్‌ను గ్రామానికి రప్పించారు. దీంతో విషయం అర్థమైన గ్రామస్తులు సుమారు 100 మంది వరకు రచ్చబండ వద్దకు చేరారు. తమకు ఎన్నో సంవత్సరాలుగా నీడనిచ్చే వేపచెట్టు, కూర్చునే రచ్చబండను తొలగించవద్దని వేడుకున్నారు. కానీ పోలీసులు మాత్రం మంత్రి స్వామి కళ్లలో ఆనందం చూడాలనే ఆరాటంతో వారందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. కానీ గ్రామస్తులు వెళ్లకపోవటంతో చివరికి పిస్తోల్ తీసి కాల్చిపారేస్తా... నాకొడల్లారా అని గురి పెట్టి బెదిరించారు. అప్పటికీ మహిళలు తగ్గకపోవటంతో లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఒక్కొక్కరిని ఒక్కో ఇంట్లో పెట్టి బయట తలుపేశారు. ఆ సమయంలో 108 గాయపడిన వారిని తీసుకుని వెళ్లడానికి వచ్చినా పోలీసులు ఒప్పుకోకపోవటంతో వారిని తీసుకుని వెళ్లకుండానే 108 వెళ్లిపోయింది. తరువాత పోలీసులు జేసీబీతో రచ్చబండను పూర్తిగా తొలగించి నీడనిచ్చే పచ్చని వేపచెట్టును పడగొట్టి ఎటువంటి ఆనవాలు లేకుండా ఉండేటట్లు ట్రాక్టర్లతో తొలగించారు. కేవలం ఒక్క సెంటు స్థలం కోసం అది కూడా టీడీపీ సానుభూతిపరుడిది అవునో కాదో తెలియని స్థలం కోసం మంత్రి స్వామి ఆదేశాలతో పోలీసులు ఈ విధంగా రాత్రి పూట విధ్వంసం సృష్టించటం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి నెట్‌వర్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్‌స్టేషన్లు పచ్చనేతల అడ్డాలుగా మారిపోయాయి. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తమ పరిధులు దాటి సివిల్ వివాదాల్లో తలదూరుస్తూ రెచ్చిపోతున్నారు. ఇదేమిటని అడిగితే లాఠీలకు పనిచెబుతున్నారు. బెదిరింపులకు దిగుతూ అధికార పార్టీకి బానిసలుగా మారిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శి, కొండపి నియోజకవర్గాల్లో అయితే ఖాకీల తీరు సెపరేటుగా ఉంది. ఇక్కడ పచ్చనేతల చేతుల్లో కీలుబొమ్మలా మారి వారు చెప్పిందే వేదంగా ప్రతిపక్ష నేతలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నేరాల అదుపునకంటే పచ్చనేతలకు జీహుజూర్ అంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ చెప్పిందే డ్యూటీగా చేస్తున్నారే తప్ప నిజమైన పోలీస్ డ్యూటీ మాత్రం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలే టార్గెట్‌గా దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీటీసీ ముప్పరాజు శ్రీనుకు చెందిన స్థలం పై కూటమి నేతలు కన్నేశారు. ఆక్రమించుకోవాలని చూడటంతో కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టులో, జిల్లా కోర్టులో కూడా ఆస్థలం ముప్పరాజు శ్రీనుకు చెందుతుందని తీర్పు వచ్చింది. గ్రామ నడిబొడ్డులో ముప్పరాజు శ్రీను ఉండడం జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అక్రమాలకు తెరలేపారు. గొట్టిపాటి లక్ష్మి ఆదేశాలతో గ్రామ కార్యదర్శి జేసీబీతో వెళ్లి సుమారు రూ.20 లక్షలతో నిర్మించుకున్న ఇంటిని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. తూర్పు వీరాయపాలెం సర్వేనంబరు 133/5 లోని 2 సెంట్ల స్థలాన్ని 2010 లో ముప్పరాజు లక్ష్మి వద్ద కొనుగోలు చేసి రిజిస్టరు చేయించుకున్నారు. అప్పడు కూడా ఇదే పోలీసులు పచ్చ రౌడీల్లా వ్యవహరించి వైఎస్సార్‌సీపీ నేతలను భయబ్రాంతులకు గురి చేశారు. ఎవరైనా అడ్డువస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ సంఘటన మరువక ముందే పసుపుగల్లు గ్రామంలో ముండ్లమూరు మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి స్థలంలో ఉన్న దుకాణాలను తొలగించారు. తూర్పు వీరాయపాలెం గ్రామంలో తొలగిస్తే ఏం చేయలేదు ఇక్కడ మాత్రం ఏం చేస్తారులే అనుకున్నారు. ఖాకీల ప్రతాపాన్ని చూపించారు. పసుపుగల్లు గ్రామంలో రిజిస్ట్రేషన్ స్థలం రోడ్డుకు అడ్డుగా లేదు. 25 సంవత్సరాల నుంచి ఆ స్థలంలో శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మండల కన్వీనర్‌గా ఉన్న శ్రీనివాసరెడ్డికి చెందిన స్థలాన్ని మంగళవారం ఉదయం గం.5.30 కు పొక్లెయిన్ తీసుకుని వెళ్లి పడగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కుటుంబ సభ్యుల అడ్డుకుని తమకున్న పత్రాలు చూపించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ రామారావు పోలీసులకే అడ్డు చెప్తారా అంటూ ఎవడ్రా ఆపింది అని రౌడీలా రెచ్చిపోయారు. మీ టైం అయిపోయింది..వెళ్లిపోండి అని గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశారు.
అడ్డు వచ్చిన మహిళలను నానా దుర్బాష లాడారు. మహిళలపై సైతం ప్రతాపం చూపించారు. శ్రీనివాసరెడ్డి పై దాడి చేసి చొక్కాను చింపి వేశారు. సీఐ లాఠీ తీసుకుని స్థానికులపై లాఠీ ఝుళిపించారు. గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామస్తులు ప్రతిఘటించి ఎదురు తిరగటంతో పోలీసులు దుకాణాలు కూల్చి వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని అడ్డం పెట్టుకుని ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి పోలీసులను తిప్పుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. డీఎస్పీ అధికారి నుంచి ఎస్సైల వరకు ఆమె ఏ మండలానికి వెళ్లినా పోలీస్ కాన్వాయ్ వెంట వెళ్లాల్సిందే.

ఖాకీ అరాచకమై..

ఖాకీ అరాచకమై..

ఖాకీ అరాచకమై..

ఖాకీ అరాచకమై..