
చౌటపాలెంలో తమ్ముళ్ల దౌర్జన్యం
పొన్నలూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రశాంతమైన గ్రామాల్లో అల్లరులు, గొడవలు, ఆస్తులను నష్టపరుస్తూ రాక్షస సంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు. తమను అడిగేవారు, అడ్డుకునే వారు లేరంటూ రోజు రోజుకు మరింతగా రెచ్చిపోతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతూ అధికార మదంతో లక్షల రూపాయిలు పెట్టుబడులతో సాగుచేసి పంటలను సైతం ట్రాక్టర్‌తో దున్నించి పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు. మండలంలోని చౌటపాలెంలో వైఎసస్ సీపీ సానుభూతిపరురాలు బోయపాటి జోత్స్యకు తండ్రి నుంచి సంక్రమించిన పొలం ఉంది. చౌటపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 75/1లో 1.75 ఎకరాలు, 77/3లో 1.60 ఎకరాల భూమి ఉంది. అలాగే అనుమోలు చిన్నమ్మాయికి సర్వే నంబర్ 1426/1, 1426/2లో 2.87 ఎకరాల పొలం ఉంది. రెవెన్యూ రికార్డులతో పాటు ఆన్‌లైన్‌లో కూడా వీరి పేరుతోనే పొలం ఉంది. దీంతో కొన్నేళ్లగా ఆ పొలంలో అనేక పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. నెల రోజుల క్రితం జామాయిల్ మొక్కలు సాగు చేశారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు నడిపినేని నరసింహం, అతని కొడుకు కిరణ్ అధికారం ఉందని జోత్స్య, చిన్నమ్మాయికి చెందిన భూమిలోని జామాయిల్ మొక్కలను ట్రాక్టర్‌తో దున్నేశారు. సదరు వ్యక్తులు కొన్ని రోజులుగా జోత్స్యకి చెందిన భూమిని కాజేయాలన్ని రాజకీయ అండదండలతో ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ట్రాక్టర్ తీసుకెళ్లి సాగుచేసిన జామాయిల్ మొక్కలను దున్నేశారు.
ఏడాదిగా బాధితురాలికి వేధింపులు..
కూటమి ప్రభుత్వం ఏర్పండిది మొదలు సదురు వ్యక్తులు పొలం విషయంలో జోత్స్యని వేధిస్తున్నారు. వాస్తవంగా జోత్స్య తండ్రి రామారావు, నడిపినేని నరసింహం అన్నదమ్ములు. అయితే భాగపంపకాల్లో భాగంగా రామారావు మరణం తరువాత అతనికి చెందిన భూమి, కుమార్తె అయిన జోత్స్యకి సంక్రమించిది. దీంతో కొన్ని రోజులుగా ఆ భూమిని ఎలాగైనా పొందాలని, ఈ భూమి తమదంటూ నరసింహం అతని కుటుంబ సభ్యులు తరచూ గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలతో ఆమె కందుకూరు సివిల్ కోర్టును ఆశ్రయించింది. 2018లో కోర్టు సదరు భూమి జోత్స్యకి చెందిదేనని తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిలో వివిధ పంటలు సాగు చేస్తూ వస్తోంది. అయితే ఏడాది వరకు స్తబ్ధుగా ఉన్న నరసింహం, కిరణ్ ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఇదే అదునుగా భావించి మంత్రి స్వామిని, అధికారులను అడ్డుపెట్టుకోని జోత్స్య భూమిని కాజేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో మంగళవారం ట్రాక్టర్ తీసుకెళ్లి జోత్స్య సాగుచేసిన జామాయిల్ మొక్కలను దున్నేశారు. ఇదేందని అడిగిన సదరు మహిళను నీ దిక్కున చోట చెప్పుకో అంటూ దుర్భాషలాడి దాడికి యత్నించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
సాగు చేసిన జామాయిల్ మొక్కలు ట్రాక్టర్‌తో దున్నివేత
అడ్డుకున్న బాధిత మహిళపై దుర్భాషలాడి దాడికి యత్నం
నాలుగు ఎకరాల్లో సాగుచేసిన జామాయిల్ మొక్కలు ధ్వంసం