
నల్లబర్లీ పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలి
● రైతుసంఘం ఆధ్వర్యంలో రైతుల నిరసన
నాగులుప్పలపాడు: నల్లబర్లీ పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆదివారం నాగులుప్పలపాడు బస్టాండ్ సెంటరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు జే. జయంత్‌బాబు, పమిడి వెంకట్రావులు మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రైవేట్ కంపెనీలు రైతులను ప్రోత్సహిస్తూ ఎంత పొగాకు పంట సాగు చేసినా కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చి రైతుల చేత బర్లీ పొగాకు వేయించారన్నారు. తీరా పంట చేతికి వచ్చిన తరువాత కంపెనీలు చేతులెత్తేయడంతో రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. ఈనేపథ్యంలో రైతుల వద్ద బర్లీ పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని పలు దఫాలు ఆందోళన కార్యక్రమం చేపట్టామన్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు చివరి ఆకువరకు కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చి రైతుల వివరాలను నమోదు చేయించింది. ఆమేరకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి గత రెండు నెలల నుంచి కొనుగోలు ప్రారంభించారు.
కూలీలకు డబ్బులు ఇవ్వలేని దుస్థితి..
ప్రస్తుతం గోదాములు ఖాళీగా ఖాళీగా లేవని సాకుతో కొనుగోలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. దాంతో ప్రస్తుతం కొనుగోలు చేసిన ప్రకారం చూస్తే సగం మంది రైతుల వద్ద మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా సగం మంది రైతుల పొగాకు ఇండ్ల వద్దనే పొగాకు చెక్కులు దర్శనమిస్తున్నాయని చెప్పారు. ఆ రైతులకు సీరియల్ పేర్లు రాక కొనుగోలు కేంద్రాలకు రాని దుస్థితి నెలకొంది. ఈ మేరకు కొనుగోలు చేసిన రైతాంగానికి ఎకరానికి రూ.50 వేల వరకు నష్టం తప్పడం లేదు. దాంతో అసలు కొనుగోలు నిలిపి వేస్తే మరింత నష్టపోతారన్నారు. పొగాకు అమ్ముడుపోక కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన హమీ ప్రకారం రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకును చివరి ఆకువరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వర్జీనీయా పొగాకు లోగ్రేడ్‌ను రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలన్నారు. లేకపోతే పొగాకు రైతాంగాన్ని ఏకం చేసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు టీ శ్రీకాంత్, జి బసవపున్నయ్య, రావెళ్ల వెంకట్రావు, నాగేశ్వరరావు, గడ్డం ఏలియ్య, పాలపర్తి యోనా, హజరత్తయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.