
సీసీపై చర్యలు తీసుకోవాలని వినతి
టంగుటూరు: గ్రామ సమైక్య సంఘంలో అక్రమాలకు పాల్పడిన సీసీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కందులూరు గ్రామంలోని కందులూరు–1 గ్రామ సమైక్య సంఘ సభ్యులు ఒంగోలులోని అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సమైక్య అధ్యక్షురాలు బొట్ల వెంకటరమణమ్మ, కార్యదర్శి ఉప్పలపాటి వెంకట్రావమ్మ, కోశాధికారి బొడ్డు సుశీల 25 గ్రామ సంఘాల సభ్యులు, మొదటి, రెండో లీడర్లతో ఎటువంటి సమావేశంగాని, సంప్రదింపులుగాని లేకుండా వెలుగు సీసీలు చెన్నుపాటి కవిత, అప్పిశెట్టి అరుణ కలిసి స్థానిక బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ జగదీశ్‌తో కలిసి ఫోర్జరీ సంతకాలతో తీర్మానం చేశారన్నారు. బ్యాంకులో వీరి పేర్లు మార్చి, చెక్ బుక్ రద్దుకి కూడా సిఫార్సు చేశారన్నారు. విషయం తెలుసుకున్న సభ్యులు ఫోర్జరీ చేసిన వారిపై విచారణ చేయాలని జేసీకి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా పౌరసరఫరాల సంస్థ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేశారు. సరైన నివేదిక ఇచ్చి జేసీకి అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సమైక్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.