
వనరులు దోచుకో..!
వాటా ఇచ్చుకో..
కనిగిరిరూరల్/పీసీపల్లి: అధికార అండతో తెలుగు తమ్ముళ్లు పెట్రేగిపోతున్నారు. ఇసుక వ్యాపారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోని గుత్యాధిపత్యం ప్రదర్శిస్తూ దోచేస్తున్నారు. వారు నిర్ణయించిన ధరకే ఇక్కడ కొనుగోలు చేయాలి. లేదంటే తట్ట ఇసుక కూడా దొరకదు. బయట ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువచ్చినా చెప్పిన ధరకే ఇచ్చేసి పోవాలి. లేదంటే వాహనం అక్కడ నుంచి కదలదు. ఇలా ఇసుక వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
అంతా అతని చేతుల్లోనే..
కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన పీసీపల్లి మండల నేత ఇసుక స్టాక్ పాయింట్ కాంట్రాక్టర్‌ను దక్కించుకున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తూ ఇతరులు వ్యాపారం చేసుకోనివ్వకుండా, గంప ఇసుక అయినా తానే ఇవ్వాలంటూ వ్యవహరిస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల స్టాక్ పాయింట్ నిర్వాహకునితో ఇసుక లోకల్ వ్యాపారులు, ట్రాక్టర్, లారీ ఓనర్లు గొడవకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. డంపింగ్ పాయింట్ నిర్వాహకుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో అతనితో ఢీకొట్టలేక మౌనం దాల్చి లోలోన తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు. ఇక పీసీపల్లి మండలంలోని వాగుల్లో తెలుగు తమ్ముళ్లు జోరుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పాలేటి నది పరివాహాక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేసి ట్రక్కు కట్టుబడి ఇసుక రూ.2,200 నుంచి రూ.2,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. తలాపాపం తిలా పిడికెడు అన్న చందంగా అధికారులు, అధికార పార్టీ నేతలు, అందరికీ వాటాలు ఉన్నట్లు ప్రచారం ఉంది.
టన్నుకు రూ.300 వరకు అదనపు దోపిడీ
కనిగిరి నియోజకవర్గానికి అత్యధికంగా నెల్లూరు, జలదంకి తదితర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా అవుతోంది. లారీ లోడింగ్‌తో కలిపి ఇసుక టన్ను కనిగిరికి చేరే సరికి రూ.600 వరకు పడుతుంది. దీన్ని నేరుగా వినియోగదారునికి అందించినా బేల్దార్‌లకు ఇచ్చినా.. అవసరాన్ని బట్టి రూ 550 నుంచి రూ 600లకు దించుతారు. అయితే స్టాక్ పాయింట్ నిర్వాహకుడు అధికార అండతో అధికారులను అడ్డుపెట్టుకుని ఇసుక లారీల డ్రైవర్లను, యజమానులను బెదరించుకుని తన స్టాక్ పాయింట్‌కు తరలించుకుంటున్నాడు. తన పాయింట్‌లో డంప్ చేసిన ఇసుకను, లేదా తన ద్వార సరఫరా చేసే..ఇసుక లారీ లోడును టన్ను రూ.800 నుంచి రూ.850లకు విక్రయిస్తున్నాడు. లారీ సుమారు 35 నుంచి 40 టన్నులు ఉంటుంది. అంటే ప్రతి టన్నుకు ఖర్చులు పోను సరాసరిన రూ.200 మిగిలినా ఒక లారీకి దాదాపు రూ.6 నుంచి రూ.8 వేల వరకు ఆదాయం మిగులుతుంది. ట్రాక్టర్ లెక్కన అయితే ట్రక్కు రూ.3,800లకు విక్రయిస్తున్నాడు. ఇందులో కూలీలు రూ.300, ట్రాక్టర్ బాడుగ రూ.500 ఖర్చవుతుంది. స్టాక్ పాయింట్ నిర్వాహకుడు అధికార పార్టీ నేత కావడంతో బయట నుంచి వచ్చే( చీమకుర్తి, సంతనూతపాడు, మార్కాపురం) ఇసుక లారీలు సైతం అతనికే లోడును దింపి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రతి రోజు కనీసం 3నుంచి 5 లారీల ఇసుక అమ్మకం జరుగుతున్నట్లు ఇసుక వ్యాపారులు చెప్తున్నారు.
కనిగిరిలో ఇసుకాసురులు
అధికార అండతో జోరుగా అక్రమ తవ్వకాలు
శివార్లలో డంపింగ్ పాయింట్లు
కనిగిరిలో ఇసుక స్టాక్ డిపో నిర్వాహకుడి ఇష్టారాజ్యం
టన్ను ఇసుకకు రూ.200 నుంచి రూ.300 అదనంగా వసూలు
అడ్డుగోలు దోపిడీతో అల్లాడుతున్న గృహ నిర్మాణదారులు
జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు
పీసీపల్లిలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ వ్యాపారం చేస్తున్నారు. అధికారం మాది, అంతా మాది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుకాసురులు అధికార పార్టీకి చెందిన వారు కావడం అక్రమార్జనలో ఎవరి వాటా వారికి దక్కుతుండటంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సైతం ఎవరికి వారు మౌనం దాల్చుతున్నారు. మండలంలో పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో జోరుగా ఇసుక తవ్వాకాలు చేస్తున్నారు. టీడీపీ మండల, గ్రామ స్థాయి నేతలు ప్రొక్‌లైన్ పెట్టి మరీ తవ్వకాలు చేసి గ్రామ శివార్లలో ఇసుక డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. మండలంలోని పెద అలవలపాడు, నేరేడుపల్లి, బట్టుపపల్లి, గంగ దగ్గర, పాటిటిల్లి, పంచలింగాల కొండ వాగుల సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సంపద సృష్టిలో భాగంగా టీడీపీ గ్రామ స్థాయి నేతలు జోరుగా ఇసుక దందా చేస్తూ రూ.లక్షలు అక్రమార్జన చేస్తున్నారు.

వనరులు దోచుకో..!