
చెడిపోయిందంటే చావే..!
సింగరాయకొండ: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం సుమారు ఐదు నెలలుగా మూతబడటంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలల క్రితం వరకూ ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే స్థానిక మరమ్మతుల కేంద్రంలో మరమ్మతులు చేయించి ఒక్క రోజులోనే బిగించేవారు. కానీ, ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే మరమ్మతులు చేయాలంటే ఒంగోలు, గుడ్లూరు తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేసి బిగించాలంటే రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టడమే కాకుండా రవాణా చార్జీలు అదనపు భారంగా మారుతున్నాయి.
నాలుగు మండలాలకు అవస్థలు...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులు, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు సింగరాయకొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికారం చేపట్టిన అతి తక్కువ సమయంలోనే దీన్ని ఏర్పాటు చేయడంతో రైతులు తమ ట్రాన్స్‌ఫార్మర్లకు తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేయించుకుని బిగించుకునేవారు. దీనివలన ఈ కేంద్రం పరిధిలోని సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి, ఉలవపాడు మండలాల రైతులు, ప్రజలు లబ్ధిపొందేవారు. ఒక్కోసారి పొన్నలూరు, టంగుటూరు మండలాల రైతులు కూడా వచ్చేవారు. ప్రతి నెలా సుమారు 50 ట్రాన్స్‌ఫార్మర్ల వరకు మరమ్మతులు చేసేవారు. దీనివలన సమయం ఆదా అవడమే కాకుండా రవాణా ఖర్చులు భారీగా తగ్గాయి. గతంలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైతే గుడ్లూరు, ఒంగోలు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఏ కేంద్రానికి వెళ్లాలన్నా సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉండటంతో రవాణాకు సుమారు 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చయ్యేది. రెండు నుంచి మూడు రోజులు సమయం పట్టేది. కానీ, సింగరాయకొండలోనే కేంద్రం ఏర్పాటు చేయడంతో వెయ్యిలోపు ఖర్చుతో అతితక్కువ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ బాగుచేసి బిగించేవారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేత...
రైతాంగానికి, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సింగరాయకొండ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 5 నెలల కిత్రం మూసివేశారు. తమ పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌కు గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టును పునరుద్ధరించకుండా అర్ధంతరంగా ఆపివేశారు. దీంతో కాంట్రాక్టర్ ఆ కేంద్రాన్ని మూసివేయగా, రైతులు, ప్రజలు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కోసం గుడ్లూరు, ఒంగోలు వెళ్తూ అవస్థపడుతున్నారు. మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేసి తిరిగి తీసుకొచ్చి బిగించేందుకు సుమారు 2 నుంచి 3 రోజులు పడుతుండగా, ఒక్కోసారి నాలుగు రోజులు కూడా పడుతోంది. దీని వలన సమయంతో పాటు రవాణా ఖర్చులు పెరిగి డబ్బు కూడా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగరాయకొండలో మూతబడిన ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం
ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోతే గుడ్లూరు, ఒంగోలు తీసుకెళ్లాల్సిన వైనం
స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు వెయ్యి ట్రాన్స్‌ఫార్మర్లు
ప్రతి నెలా సుమారు 50 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు
ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తడిసి మోపెడవుతున్న రవాణా ఖర్చులు
ఐదు నెలలుగా అవస్థపడుతున్న రైతులు, ప్రజలు
కొత్త కాంట్రాక్టర్‌ను నియమించినా ప్రారంభం కాని పనులు...
సుమారు నెల క్రితం కొత్త కాంట్రాక్టర్‌ను సింగరాయకొండ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రానికి నియమించారు. కానీ, ఆయన పనులెప్పుడు ప్రారంభిస్తారో అర్థం కావడం లేదని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైతే బాగుచేసి మళ్లీ బిగించటం ఆలస్యం అవుతుండటంతో పక్క ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారం పడి అవి కూడా త్వరగా మరమ్మతులకు గురవుతున్నాయని విద్యుత్ శాఖ వారు తెలియజేస్తున్నారు. అందువలన ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సింగరాయకొండ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రంలో త్వరగా ప్రారంభించేలా చూడాలని, తద్వారా తమ ఇబ్బందులు తీర్చాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

చెడిపోయిందంటే చావే..!