
ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతున్న యువకుడు మృతి
అర్ధవీడు: ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం గ్రామానికి చెందిన వేల్పుల మల్లీశ్వరుడు (22) గత నెల 31వ తేదీ వ్యక్తిగత సమస్యలతో కలత చెంది క్షణికావేశంలో మద్యంలో గడ్డి మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కంభంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు అర్ధవీడు ఎస్సై సుదర్శనయాదవ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పెద్దదోర్నాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని పెద్ద బొమ్మలాపురం తూర్పుపల్లెలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేశపోగు యోహాన్ (41) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబంలో కొద్దిపాటి వివాదం తలెత్తిందని, ఈ నేపథ్యంలో యోహాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
మనస్తాపంతో మరో వ్యక్తి...
నాగులుప్పలపాడు: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్న సంఘటన నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో శనివారం జరిగింది. కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన మల్లాల శ్రీను (53) ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఒక మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. కొద్దిరోజుల నుంచి అతన్ని ఆ మహిళ దూరం పెట్టడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రజియా సుల్తానా తెలిపారు.
జరుగుమల్లి (సింగరాయకొండ): సాంకేతిక సమస్యల కారణంగా లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన శనివారం మధ్యాహ్నం జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట పరిధిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో గల దాబా వద్ద జరిగింది. టంగుటూరు అగ్నిమాపక అధికారి తెలిపిన సమాచారం ప్రకారం.. జార్కండ్ నుంచి చైన్నె వెళ్తున్న లారీ చాసిస్ క్యాబిన్‌లో కె.బిట్రగుంట పరిధిలోకి రాగానే మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. టంగుటూరు అగ్నిమాపక అధికారి ఏ రమణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి క్యాబిన్‌లోని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. సిబ్బంది పాండురంగారావు, కిషోర్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతున్న యువకుడు మృతి