
రక్షించిన పోలీసులు
బలవన్మరణానికి యత్నించిన మహిళ..
కంభం: బలవన్మరణానికి పాల్పడేందుకు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను పోలీసులు కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన శనివారం ఉదయం కంభంలో చోటుచేసుకుంది. కంభం పట్టణంలోని మేదరవీధికి చెందిన లాలమ్మ అనే మహిళ శనివారం ఉదయం 8.45 గంటల సమయంలో నాగులవరం రైల్వే గేటు సమీపంలో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఎర్ర చీర ధరించి ఉండటంతో రైలు పట్టాలపై వస్తున్న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవరు అప్రమత్తమై రైలు ఆపడంతో మహిళకు ప్రమాదం తప్పింది. ఆ రైలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ రైలు పట్టాలపై నడుచుకుంటూ కంభం చెరువుకట్టవైపు ఆమె వెళ్తుండగా చెరువుకట్ట గేటు వద్ద ఉన్న రైల్వే సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్సై నరసింహారావు ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు.
మార్కాపురంలో మరో వ్యక్తిని కాపాడిన పోలీసులు...
మార్కాపురం: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని పోలీసులు సకాలంలో స్పందించి కాపాడిన సంఘటన శనివారం మార్కాపురం రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణానికి చెందిన టి.సురేంద్ర కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోతున్నట్లు ఉదయం 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. కుటుంబ సభ్యులు వెంటనే రూరల్ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. డీఎస్పీ, సీఐ సూచనల మేరకు ఐటీ కోర్ టీమ్ సహాయంతో సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని మార్కాపురం రూరల్ ఎస్సై అంకమ్మరావు గుర్తించారు. వెంటనే అతను ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని సురేంద్ర ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మానసిక ధైర్యం కల్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు.

రక్షించిన పోలీసులు