
కోర్టు ఆవరణలో వైద్య కేంద్రం
● ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి
ఒంగోలు: జిల్లా కోర్టు ఆవరణలో వైద్య కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా కోర్టు ఆవరణలోని పోస్టాఫీసు ఉన్న బ్లాక్‌లోని ఒక గదిలో ఏర్పాటు చేయగా, భారతి మాట్లాడుతూ న్యాయస్థానాల సముదాయం ఆవరణలో చికిత్స కేంద్రం ఏర్పాటు ద్వారా న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులతో పాటు కక్షిదారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు జి.దీన, పందిరి లలిత, సీనియర్ సివిల్ జడ్జి హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్‌కే ఇబ్రహీం షరీఫ్, జూనియర్ న్యాయమూర్తులు భానుసాయి, నవ్యశ్రీ, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, ప్రకాశం జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చాకిరి సుధాకరరావు, తదితరులు పాల్గొన్నారు.