
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న మనువాదులు
ఒంగోలు టౌన్: దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో దోహదపడిందని, అధికారంలోకి వచ్చిన మనువాదులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో శుక్రవారం నిర్వహించిన ఒంగోలు కళా ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పలు కులాలు, మతాలు, భాషలు ఉన్నాయని చెప్పారు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. బీజేపీపై వామపక్షాలు చేస్తున్న పోరాటంలో కళాకారులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పాలకుల అవినీతి బాగోతాలను ఎండగట్టాలన్నారు. సినీ నటుడు మాదాల రవి మాట్లాడుతూ తెలుగు సినిమా రంగానికి ఎంతో మంది కళాకారులను అందించిన ఘనత ప్రజా నాట్యమండలికి దక్కుతుందని చెప్పారు. పోలీసు వారి హెచ్చరిక దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ దేశంలో జరిగిన చారిత్రక పోరాటాల్లో ప్రజా కళాకారులు పోషించిన పాత్రను చరిత్ర ఎన్నటికీ మరచిపోదన్నారు.
ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఏపూరి సోమన్న ఆటపాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినీనటుడు సన్నీ అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి నాయకులు, నల్లూరి వెంకటేశ్వర్లు, చంద్రా నాయక్, చిన్నం పెంచలయ్య, రామకృష్ణ, నాగరాజు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.