
అసెస్మెంట్ బుక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
ఒంగోలు సిటీ: పాఠశాలల్లో పరీక్షల నిర్వహణలో మూల్యాంకన పుస్తకాలు విద్యార్థులకు సరఫరా చేసే కొత్త విధానం అనేక సమస్యలకు దారి తీస్తోందని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏడీ వరప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విధానం పాఠశాల పనివేళల్లో బోధన సమయాన్ని హరించేలా ఉందన్నారు. పాఠశాలలో మూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి బోధన గంటలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. మార్కుల నమోదు కూడా ఉపాధ్యాయులకు పని భారంగా పరిణమించిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ నమోదు, రిజిస్టర్ నమోదుతో పాటు బబ్లింగ్ చేసే పని కూడా ఉపాధ్యాయులకు సంక్రమించిందన్నారు. ఆన్‌లైన్ విధానంలో నమోదుకు మాత్రమే పరిమితమై మిగిలిన నమోదు నుంచి వెసులుబాటు ఇవ్వాలని పేర్కొన్నారు. కొత్త విధానంతో మంచి ఫలితాలు రావు సరికదా నష్టదాయకంగా మారకముందే ఈ విధానం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. జిల్లా సబ్ కమిటీ సభ్యులు హనుమంతురావు, శేషారావు, ఓ.రవి, మండల శాఖ బాధ్యులు వీరరాఘవులు, రామారావు, సుబ్బయ్య, రాము, ఓ.హరి ప్రసాద్, రవి పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్