
పెద్దదోర్నాలలో ‘హ్యూజ్’ మనీ స్కాం
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
పెద్దదోర్నాల: సులభ పద్ధతులతో డబ్బులు సంపాదించవచ్చన్న ఆశ కొందరిని నిలువునా ముంచుతోంది. ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మండల కేంద్రంలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. హ్యూజ్ మనీ యాప్‌తో మండల ప్రజలు మరో మోసానికి గురయ్యారు. వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించవచ్చని ప్రజలను నమ్మించిన సైబర్ నేరగాళ్లు యాప్ లింకులతో మండల ప్రజలతో భారీగా డబ్బులు సేకరించి బోర్డు తిప్పేశారు. హ్యూజ్ పేరుతో వెలిసిన ఈ సైబర్ సంస్థలో డబ్బులు కొంత మొత్తంలో జమ చేస్తే ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందవచ్చన్న పుకార్లను నమ్మి ప్రజలు వేలల్లో పెట్టుబడులు పెట్టారు. చివరకు సంస్థ బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేష్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి యాప్‌లకు సంబంధించిన లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. మండల కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం హ్యూజ్ యాప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ప్రజలు మోసపోయినట్లు సమాచారం.
టంగుటూరు: నోబిడ్లు అధికంగా జరుగుతున్నాయని చింతలపాలెం, దావగూడూరు గ్రామాలకు చెందిన రైతులు శుక్రువారం వేలం ప్రక్రియను అడ్డుకున్నారు. వేలం ప్రారంభమైన తర్వాత 40 బేళ్లు కొనుగోలు జరగగా వరుసగా 17 పొగాకు నోబిడ్లు, 5 పొగాకు బేళ్లు నో సేల్ జరిగాయి. దీంతో రైతులు ఆగ్రహం చెంది వేలాన్ని ఆడ్డుకున్నారు. వేలం నిర్వహణాధికారి గంట పాటు అటు కంపెనీ ప్రతినిధులతో, ఇటు రైతులతో చర్చలు జరిపినా ఫలితం లేదు. మధ్యాహ్నానికి ఒంగోలు ప్రాంతీయ అధికారి రామారావు వేలం కేంద్రానికి చెరుకొని మరో గంట చర్చలు జరిపినా రైతులు వేలం కేంద్రం వదిలి వెళ్లారు. వేలానికి 811 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 17 కొనుగోలు జరగగా 24 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.288కాగా, కనిష్ట ధర రూ.140 పలకగా సరాసరి రూ.199.57 ధర పలికిందని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
● ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి నుంచి రూ.60 వేలు మాయం
కనిగిరి రూరల్: పట్టణంలో మరో ఆన్‌లైన్ సైబర్ మోసం వెలుగు చూసింది. 13వ వార్డు మంగలి మాన్యానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆయన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు 60 వేల రూపాయలు మూడు దఫాలుగా డ్రా చేశారు. గురువారం రాత్రి సెల్‌కు బ్యాంక్ ఓటీపీలు వరుసగా వచ్చాయి. అప్రమత్తమైన బాధితుడు వెంటనే మేనేజర్‌కు సమాచారం ఇచ్చాడు. ఓటీపీ లింక్‌లు తాక వద్దని ఆయన బాధితుడిని సలహా ఇచ్చారు. మరో అరగంటలోపు 22,400 ఒకసారి, రూ.19 వేలు మరోసారి, 18,600 ఇంకో సారి మొత్తం మూడు సార్లు రూ.60 వేలు దాక డ్రా చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో మళ్లీ వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని, వెంటనే ఫోన్ స్వీచ్ ఆఫ్ చేయాలని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. కుమార్తె వివాహం కోసం దాచి పెట్టుకున్న నగదు కాజేయడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.
ఒంగోలు టౌన్: నూతన బార్ల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. వెంకట్ కోరారు. శుక్రవారం స్థానిక ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన బార్ పాలసీ గురించి వ్యాపారులకు వివరించారు. జిల్లా అధికారుల సమక్షంలో లాటరీ తీసి షాపులు కేటాయిస్తామని చెప్పారు.