
పుస్తకావిష్కరణలో రచయితల సందడి
ఒంగోలు టౌన్: నగరంలోని పీవీఆర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న పుస్తకావిష్కరణ మహోత్సవంలో ఎనిమిదో రోజు శుక్రవారం రచయితలు సందడి చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రచయితలు, పాఠకులు, సాహితీ ప్రేమికులతో పుస్తకాల స్టాల్స్ వద్ద రద్దీ నెలకొంది. దేశభక్తి గీతాల పోటీలో 80 మందికి పైగా పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వివిన మూర్తి రచించిన వాడూ–నేనూ, డా.దేవరాజు మహారాజు రచించిన హిందుత్వ సింహాసనం మీద అబద్ధాల చక్రవర్తి పుస్తకాలను ఆవిష్కరించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగిస్తూ.. సమాజంలో నేటికి అంటరానితనం కొనసాగుతోందని, ఇది దేశానికి ఎంత మాత్రం మంచిదికాదన్నారు. మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత 11 ఏళ్ల కాలంలో ఏకంగా 140 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశాన్ని ముంచేశారని విమర్శించారు. దేశంలో మతోన్మాద శక్తులు చెలరేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ మూర్తి ప్రసంగిస్తూ... నేనూ వాడు పుస్తకంలో దళితుల సమస్యలను చర్చించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రదర్శన అధ్యక్ష కార్యదర్శులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య పాల్గొన్నారు.