
బాబు పాలనలో రాష్ట్రం నిలువు దోపిడీ
చంద్రబాబు మోసాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి
మద్దిపాడు: రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నిలువు దోపిడీ చేస్తూ కార్పొరేట్లకు భూములు అమ్మేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. మండలంలోని ఇనమనమెళ్లూరు గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అబద్ధాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఏడాదిలో చేసిన మోసాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. బినామీ కంపెనీలతో భూములు మొత్తం కొనుగోలు చేయిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలతో పాటు సిట్టింగ్‌కు అనుమతులు ఇచ్చి 14 గంటల పాటు మద్యం విక్రయించేలా అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. గ్రామాల్లో 24 గంటలూ బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. డీఎస్సీలో మెరిట్ లిస్టు ప్రకటించకుండానే ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని వెనుక లోకేష్ హస్తం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సర్కారు ఉద్యోగార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. పింఛన్ రూ.4 వేలకు పెంచి వేల సంఖ్యలో దివ్యాంగుల పింఛన్లు రద్దు చేసి దివ్యాంగుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఒకటి రెండు హామీలను అరకొరగా అమలు చేసి అన్నీ చేశామని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి పాలనకు ప్రజలు తేడా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో మూడేళ్ల కాలంలో పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు ఇలా ఎన్నో నిర్మాణాలు చేస్తే చంద్రబాబు ఏడాదిలో చేసింది శూన్యమన్నారు. నిన్న మొన్నటి వరకు విజన్ 2020 అని, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని, అవేమీ ఎవరికీ అర్థం కావన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో ఎంతో మంది అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో ఒక్క పథకాన్ని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను తెలుసుకోవడానికి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆయన మోసాలు అన్ని తెలుస్తాయన్నారు. ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, సంతనూతపాడు అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, పైడిపాటి వెంకట్రావు, యల్లమందారెడ్డి, కందుల డానియేల్, కిష్టిపాటి శేఖరరెడ్డి, బొమ్మల రామాంజనేయులు, సన్నపురెడ్డి రమణమ్మ, బెజవాడ రాము, పల్లపాటి అన్వేష్, నాదెండ్ల మహేష్, తేళ్ల పుల్లారావు, మద్దా లక్ష్మీనారాయణ, విల్సన్, పూనాటి అప్పయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున