
అటవీ శాఖ సిబ్బందిపై దాడి హేయమైన చర్య
ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి అటవీశాఖ సిబ్బందికి అండగా గిరిజన ప్రజాసమాఖ్య ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్
మార్కాపురం:
అటవీశాఖ సిబ్బందిపై దాడిచేసి భయభ్రాంతులకు గురిచేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు. శ్రీశైల శిఖరం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఫారెస్టు అధికారులపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మద్యం సేవించి సిబ్బందిపై దాడి చేసినందుకు నిరసనగా సభ్యులతో కలిసి మార్కాపురంలోని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్‌కు వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అటవీశాఖ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫారెస్టు అధికారిక వాహనాన్ని తానే నడుపుతూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. శ్రీశైలం ఘాట్‌లో రాత్రిపూట వాహనాన్ని తిప్పి అక్కడి నుంచి అతిథి గృహానికి తీసుకెళ్లి తన అనుచరులతో దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. విధి నిర్వహణలో యూనిఫాంలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేయడంతో పాటు మానసిక క్షోభకు గురైన అధికారులకు తక్షణమే అన్నీ విధాలుగా అండగా ఉండాలన్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, విధి నిర్వహణకు ఆటంకం పరిచిన అంశాలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అధికారులకు అండగా తాము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా, అటవీ శాఖ అధికారులకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ నాయక్ డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు రామూనాయక్, ధర్మా నాయక్, మనోజ్ నాయక్, వీరాంజనేయులు నాయక్, హనుమంత్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.