
సాగర్ నీరు వెంటనే విడుదల చేయాలి
త్రిపురాంతకం: నాగార్జున సాగర్ కాలువల ద్వారా రైతులకు సాగు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. త్రిపురాంతకం మండలం నడిగడ్డకు వచ్చిన ఆయనను కలిసిన రైతాంగం సమస్యలు ఏకరువు పెట్టారు. సాగర్ జలాశయంలో నిండుగా నీరున్నా రైతాంగానికి సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రజలకు నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణానది పరవళ్లు తొక్కుతూ సముద్రానికి తరలిపోతున్నా సాగర్ ఆయకట్టుదారులు నారు వేసుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం, అధికారులు ఇకనైనా రైతుల గురించి ఆలోచించాలన్నారు. ఇదే విధంగా కొనసాగితే సకాలంలో పంటలు వేసుకోలేరని చెప్పారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచి పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. రైతులు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించి వారికి పంట రుణాలు అందించి ఖరీఫ్ పంటలకు అన్ని విధాలా సహకరించాలని అధికారులను, బ్యాంకర్లను చంద్రశేఖర్ కోరారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, పార్టీ కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, గాలెంయ్య, రమణారెడ్డి, నారాయణరెడ్డి, మురారి గాలెయ్య తదితరులు ఉన్నారు.