కంభం: చిరుతపుటి సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఆర్వో ఆనందరావు సూచించారు. కంభం మండలంలోని నడింపల్లి, ఔరంగబాద్ గ్రామాల సమీపంలోని ఏనుగు కొండ పరిసరాల్లో ఉన్న పంట పొలాల్లో చిరుత పాదముద్రలను రైతులు గుర్తించిన విషయం తెలిసిందే. పులి సంచరిస్తోందని తెలియడంతో అప్రమత్తమైన ఫారెస్టు అధికారులు పాదముద్రలు ఉన్న ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వర్షం పడటం వల్ల పులి పాదముద్రలు స్పష్టంగా లేవని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని డీఆర్వో తెలిపారు.
చీమకుర్తి రూరల్: చీమకుర్తి మండల పరిధిలోని రామతీర్థం ప్రాంతంలో మైనింగ్, విజిలెన్స్ అధికారులు బుధవారం వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనింగ్ బిల్లులు లేకుండా గ్రానైట్ ముడిరాళ్లను తరలిస్తున్న ఏడు వాహనాలను సీజ్ చేశారు. గ్రానైట్ బ్లాకులు తరలిస్తున్న మూడు లారీలు, ఫినిషింగ్ మెటీరియల్ తరలిస్తున్న 2 లారీలు, కంకర ముడిరాయి తరలిస్తున్న 2 లారీలను సీజ్ చేసి ఏపీఎండీసీ ప్రాంగణానికి తరలించారు.
● 24వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సూచన
ఒంగోలు సిటీ: స్పౌజ్, మ్యూచువల్ ప్రాతిపదికన అంతర్ జిల్లా బదిలీలకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు లీప్ యాప్‌లో ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారికి గురువారం నుంచి 24వ తేదీలోగా అందజేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో వెరిఫికేషన్ అనంతరం తుది జాబితాను 30వ తేదీన ప్రభుత్వానికి సమర్పిస్తారని పేర్కొన్నారు. పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం అర్హులైన ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం ఎంఈఓ, డీవైఈఓ, డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
పామూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన బుధవారం మండల కేంద్రమైన పామూరులోని తూర్పు వీధిలో వెలుగుచూసింది. వివరాలు.. తూర్పు వీధికి చెందిన బోగ్యం పేరమ్మ తమ బంధువైన యాటా ప్రసన్న ఇంటికి మంగళవారం రాత్రి వెళ్లింది. బుధవారం ఉదయం ఆమె తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి బయట తాళం పగలగొట్టి ఉంది. బీరువా తాళం పగలగొట్టి 4 గ్రాముల బంగారు కమ్మలు, రూ.10 వేల నగదు చోరీకి గురయ్యాయని పేరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు.
కనిగిరిరూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాచవరానికి చెందిన యు రమణారెడ్డి (44) మంగళవారం రాత్రి బైక్‌పై ప్రధాన రహదారి దాటుతూ బైక్ జారడంతో కింద పడ్డాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు ఉన్న కాలువ రాయిని గుద్దుకుని రమణారెడ్డికి బలమైన దెబ్బలు తగలి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి కార్యదర్శి నెల రోజుల క్రితం వారం రోజుల పాటు విధులకు గైర్హాజరవడంతో ఎంపీడీఓ వి.జ్యోతి అతనిపై చర్యలకు డీపీఓకు రిపోర్టు పంపారు. సదరు కార్యదర్శి తన ఇష్టానుసారంగా తిరుగుతూ అవసరమైన రోజు కార్యాలయానికి వెళ్లి పనులు చేసుకుంటున్నాడని స్థానికులు విమర్శిస్తున్నారు. గుండ్లాపల్లి గ్రామానికి ఇన్‌చార్జిగా పక్క గ్రామానికి చెందిన కార్యదర్శిని నియమించినప్పటికీ చార్జి అప్పగించకపోవడంతో గ్రామంలో జరగాల్సిన పనులు కుంటుబడుతున్నాయని అంటున్నారు. దీనిపై డీపీఓ వెంటనే చర్యలు తీసుకోవాలని, తద్వారా గ్రామంలో ఇబ్బందులు తొలగించేందుకు కొత్త కార్యదర్శిని నియమించాలని కోరుతున్నారు.

పులి జాడ కోసం గాలింపు