
మహిళల సమస్యలపై ఐక్య ఉద్యమాలు
కొండపి: మహిళలు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు నిర్మించాలని ఐద్వా జిల్లా మహాసభలు తీర్మానించాయి. ఐద్వా జిల్లా మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌కే మస్తాన్‌బి మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, ఆకృత్యాలు పెరిగేందుకు కారణమైన మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఏడాది కాలంలో 35 వేల మందిపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. మద్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరకడమే నేరాలు పెరిగిపోవడానికి కారణమన్నారు. ఆకృత్యాలకు పాల్పడిన దోషులపై సకాలంలో విచారణ చేసి శిక్షలు వేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య కులం, మతం పేరుతో, ప్రాంతీయ తత్వాల పేరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే మహిళలకు సంపూర్ణ రక్షణ ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ములుగా ఉన్న మహిళలకు పాలకులు ప్రాధాన్యం ఇవ్వకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ మూడేళ్ల ఉద్యమ సమీక్ష, భవిష్యత్ కర్తవ్యాల నివేదికపై మండలాల వారీగా చర్చలు చేసి కార్యదర్శి నివేదికను తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. పీడీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కల్పన, వీరాస్వామి, కేజీ మస్తాన్, కొండయ్య, సుజాత, సూరిబాబు, రూబెన్, బాబురావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
హనుమంతునిపాడు: స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం 53 మద్యం బాటిళ్లు పగులగొట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాధవరావు మాట్లాడుతూ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పీవీ వెంకట్ పర్యవేక్షణలో గతంలో నమోదైన వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 53 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 3.5 లీటర్లు దేశీయ సారాయి ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.