
వైరల్ ఫీవర్!
పశ్చిమానికి
మార్కాపురం: పశ్చిమ ప్రకాశం వాసులు జ్వరాలతో మంచం పడుతున్నారు. వైరల్ ఫీవర్ వేగంగా వ్యాపిస్తుండటంతో వందలాది మంది బాధితులు చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు క్యూ కడుతున్నారు. మార్కాపురం జీజీహెచ్‌కు వస్తున్న జ్వర పీడితుల సంఖ్య చాంతాడులా పెరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రులు సైతం జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. మార్కాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాలతోపాటు డివిజన్ పరిధిలోని మండలాల నుంచి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 19వ తేదీ వరకు 194 మంది జ్వర పీడితులు జీజీహెచ్‌లో చికిత్స పొందగా, ప్రస్తుతం 32 మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. మార్కాపురం పట్టణంలోని సుమారు 20 ప్రైవేట్ వైద్యశాలలు రోగులతో నిండిపోతున్నాయి. పలువురు జ్వరపీడితులు నీరసంతో ఇబ్బంది పడుతూ సైలెన్ బాటిల్స్ పెట్టించుకుంటున్నారు. కాగా వైద్యశాలల్లో ల్యాబ్‌లన్నీ రక్త పరీక్షలకు వచ్చిన వారితో నిండిపోతున్నాయి.
పారిశుధ్యం అధ్వానం
మార్కాపురం డివిజన్‌లోని గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. కొద్దిపాటి వర్షానికే అంతర్గత రోడ్లు బురదమయంగా మారడం, వర్షం నీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల ధాటికి తట్టుకోలేకపోతున్నామని, రోజూ ఫాగింగ్ చేయాలని పట్టణ ప్రాంతాలతోపాటు పల్లె వాసులు కోరుతున్నారు.
మార్కాపురం జీజీహెచ్‌కు జ్వర బాధితుల క్యూ
వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యంపాలు
కిటకిటలాడుతున్న ప్రైవేట్ వైద్యశాలలు

వైరల్ ఫీవర్!