
ప్రధాని మోదీ చౌకీదార్ కాదు చోర్
● ప్రజా రచయిత జయరాజ్
ఒంగోలు టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను చౌకీదార్ అని చెప్పుకుంటున్నారని, నిజానికి ఆయన దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న చోర్ అని ప్రజా రచయిత జయరాజ్ విరుచుకుపడ్డారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూంలో బుధవారం నిర్వహించిన ఒంగోలు కళాఉత్సవాల్లో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలనలో సాధించిందేమీ లేదన్నారు. బీజేపీ పాలనలో దేశం వందేళ్లు వెనక్కి పోయిందన్నారు. మాటరాని వాడి గొంతుకగా ప్రజలను చైతన్య పరచడానికి కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న కృషిని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ తెలుగు సినీ రంగానికి మాదాల రంగారావు, వందేమాతరం శ్రీనివాస్, బాబ్జీ, అజయ్ ఘోష్ వంటి కళాకారులను అందించిన ఘనత ప్రజా నాట్యమండలికి దక్కుతుందని చెప్పారు. ప్రజల హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు అహర్నిశలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో కళాకారులు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడేదే కళలని, ప్రజా నాట్యమండలి ప్రజల గొంతకను బలంగా వినిపిస్తుందన్నారు. నెల 23, 24 తేదీల్లో ఒంగోలులో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్ అధ్యక్షత వహించగా కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామకృష్ణ, శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా కళాకారులు ఉమక్క, సామ్యేల్, దేవరాజ్, ప్రేమానందం, బొల్లుముంత కృష్ణ, జయరావులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.