
బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 2025–26లో 10 వేల హెక్టార్లలో నూతనంగా డ్రిప్, స్పింక్లర్ల ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. భాగ్యనగర్‌లోని కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాలో బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఏపీఎంఐపీ ఎంఐఏఓపీలు, హార్టికల్చర్ అధికారులు, వీహెచ్‌ఏల ద్వారా రైతులను గుర్తించామన్నారు. స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా 8,915 రైతులకు 11,221.91 హెక్టార్లకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. అందులో 1,118 రైతులకు సంబంధించి 1,433.02 హెక్టార్లకు డ్రిప్, స్పింక్లర్లకు కలెక్టర్ ద్వారా పరిపాలన ఆమోదం తీసుకున్నామన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గత ఏడాది పంటలకు ధరలు ఆశించిన మేరకు రాకపోవడంతో మిరప, పొగాకు, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు మే మొదటి వారం నుంచి ప్రత్యామ్నాయ పంటలుగా పత్తి, మొక్కజొన్న, కంది, బొప్పాయి, నిమ్మ, బత్తాయి, మామిడి, కూరగాయలు, పూలమొక్కలు, కరివేపాకు సాగు చేసుకునేందుకు రైతులు ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు.
జిల్లాలో 10 వేల హెక్టార్లలో సాగు లక్ష్యం
ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు