
సంపద కిక్కు!
పీకలదాకా తాగించడమే ప్రభుత్వ లక్ష్యం
నూతన పాలసీతో విచ్చలవిడి అమ్మకాలు
రోజుకు 14 గంటల బార్ పనివేళలు
బెల్టుషాపుల ద్వారా 24 గంటలూ విక్రయాలు
జిల్లాలో 29 బార్లకు నోటిఫికేషన్ విడుదల
ఇప్పటికే 189 మద్యం దుకాణాలు
రోజుకు రూ.3 నుంచి రూ.6 కోట్ల మద్యం విక్రయాలు
రూ.10 కోట్ల ఆదాయమే లక్ష్యంగా బార్లు,పర్మిట్ రూంలకు అనుమతి
కూటమి పాలనలో 16 శాతం పెరిగిన విక్రయాలు
జీవితాలు గుల్లయిపోతున్నాయంటూ కన్నీరు పెట్టుకుంటున్న మహిళలు
ఇదేనా సంపద సృష్టి అంటూ ప్రజా సంఘాల ధ్వజం
ప్రభుత్వం 14 గంటలు మద్యం విక్రయిస్తుంటే..కూటమి నాయకులు 24 గంటలూ మద్యం అమ్మకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన పాలసీతో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటికే ప్రతి వీధిలోనూ బెల్టుషాపులు..అది చాలదన్నట్టు ప్రతీ మద్యం దుకాణానికి పర్మిట్ రూములు, 14 గంటలు బార్లు బార్ల తెరిచేలా ప్రభుత్వ నిర్ణయించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనా సంపద సృష్టి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో అధికారికంగా 189 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేసిన దుకాణాలకు అదనంగా ఒక్కో దుకాణానికి అనుబంధంగా పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు పుట్టుకొచ్చాయి. జిల్లాలోని 729 పంచాయతీల్లోని 1823 గ్రామాలుండగా ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. అక్రమంగా కోట్లాది రూపాయలు జేబులో వేసుకుంటున్నా కూటమి పాలకుల కడుపు నిండడంలేదు. దాంతో మరింతగా అమ్మకాలు పెంచుకునేందుకు పర్మిట్ రూంలు, బార్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల జేబులు ఖాళీ చేయడం ద్వారా సంపద సృష్టించేందుకు శ్రీకారం చుట్టింది.
29 బార్లకు నోటిఫికేషన్
జిల్లాలో 29 బార్లకు కూటమి ప్రభుత్వం రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. 26 బార్లు ఓపెన్ కేటగిరీలోకి వస్తాయి. మిగిలిన మూడు బార్లు గీత కార్మికులకు కేటాయించింది. ఇందులో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 16 బార్లు ఏర్పాటు చేయనుంది. మార్కాపురం పరిధిలో 5, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, గిద్దలూరు పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 24 మద్యం దుకాణాలున్నాయి. ఈ 16 బార్లతో కలుపుకుంటే 40 దుకాణాలు మందుబాబులకు అందుబాటులో ఉంటాయి. ఇక మందుబాబులకు తాగినోడికి తాగినంత మద్యం దొరుకుంది.
రోజుకు రూ.3 కోట్ల మద్యం విక్రయాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడతల వారీగా మద్య నిషేధం చేయాలని భావించి ప్రభుత్వం ద్వారా మద్యం విక్రయాలు ప్రారంభించారు. అందుకు భిన్నంగా కూటమి పాలకులు ప్రజల చేత మద్యం తాగించడమే పనిగా పెట్టుకున్నారు. దాంతో ఏడాది కాలంలోనే జిల్లాలో 12 నుంచి 16 శాతం మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. రోజుకు రూ.3 కోట్లకు పైగానే మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. పండుగలు, ఆదివారం సెలవులు, జాతరలు, తిరునాళ్లు జరిగే సమయంలో ఏకంగా రూ.6 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సరాసరిన నెలకు రూ.100 నుంచి రూ.120 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.
మరింత ఆదాయమే లక్ష్యంగా ముందుకు
నెలకు రూ.120 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పలు మార్గాలను అన్వేషిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బార్లు, పర్మిట్ రూంలకు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఇందుకుగాను తాజాగా 29 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో బార్‌కు అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించింది. ప్రాసెసింగ్ ఫీజు మరో రూ.10 వేలు కలిపి రూ.5.10 లక్షల చలానా కట్టాల్సి వస్తుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. లైసెన్స్ ఫీజును రెండు శ్లాబులుగా విభజించారు. 50 వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాలకు రూ.35 లక్షలు, 50 వేల జనాభా దాటిన ప్రాంతాలకు రూ.55 లక్షలుగా నిర్ణయించారు. జిల్లాలో 21 బార్లు రూ.55 లక్షల పరిధిలో ఉండగా మిగిలిన 8 బార్లు రూ.35 లక్షల పరిధిలో ఉన్నాయి. గీత కార్మికులకు కేటాయించిన 3 బార్లకు 50 శాతం రాయితీ. ఈ ఫీజును 6 విడతలుగా చెల్లించే వెసులుబాటు ఉంది. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే డ్రా తీస్తామని, లేని పక్షంలో ఆయా బార్ల పరిధిలో మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 29 బార్లకు గాను అప్లికేషన్ల రూపంలోనే సుమారు రూ.6 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫీజుల రూపంలో రూ.14.35 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రజల జేబుల నుంచే వసూలు చేస్తున్నారన్న సంగతిని మరిచిపోకూడదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మందే మందు...
నిన్నా మొన్నటి వరకు రోజుకు 12 గంటల పాటు మద్యం విక్రయాలు చేసేలా నిబంధనలు విధించారు. ఇప్పుడు తాజాగా అదనంగా మరో 2 గంటల పాటు మద్యం విక్రయించేందుకు అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లలో మద్యం విక్రయించేందుకు అనుమతించడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల్లో 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పొద్దస్తమానం కూలి పనులు చేసి సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలబెడుతున్నారని మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరికొందరు మగాళ్లు మద్యం కోసం భార్యాబిడ్డలను వేధిస్తున్నారని, ఇంట్లోని వస్తువులను తీసుకెళ్లి తెగనమ్ముకుంటూ పీకలదాకా తాగుతున్నారని వాపోతున్నారు. శ్రామిక ప్రజల సంపాదనను మద్యం పేరుతో దోచుకుంటున్న పాలకులు సంపద సృష్టిస్తున్నామని గొప్పలు చెబుతుండడం సిగ్గుచేటని ప్రజా సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
మహిళలపై పెరిగిపోయిన హింస
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల మీద అన్నీ రకాల హింస పెరిగింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోయాయి. మందుబాబుల ఆగడాలతో మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. దీనితోపాటుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యులు అల్లాడి పోతున్నారు. చేయడానికి పనులు లేక యువకులు ఆవేదనకు గురవుతున్నారు. అర్ధరాత్రి వరకూ బార్లకు అనుమతులు, పర్మిట్ రూంలకు అనుమతివ్వడం చాలా దారుణం. ఆదాయం గురించి తప్ప ప్రజారోగ్యం గురించి పాలకులు పట్టించుకోకపోవడం విచారకరం.
– మర్రి విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు

సంపద కిక్కు!

సంపద కిక్కు!