
ఉపాధి పనుల్లో భారీ అవినీతి
సంతకాలు పెట్టుకుని డబ్బులు డ్రా చేశారు పనుల కొలతల్లో భారీ తేడాలు గ్రామాల్లో రైతులకు తెలియకుండా పనులు చేసినట్లు బిల్లులు టీఏలు, ఎఫ్‌ఏల అవినీతిపై పీడీ మండిపాటు
దర్శి: ‘‘ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గుండాలి..ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి..ఇంత అవినీతి పనులకు డబ్బులు ఎలా చెల్లించారు..ఒక్కటంటే ఒక్క పనీ సక్రమంగా లేదు..మిమ్మల్ని ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు. కొలతల్లో మరీ ఇంత తేడాలా..అన్నీ కొలతలు తేడాలే..పనులు చేయకుండా కాలువలు నీరొచ్చి పూడి పోయాయని ఎలా చెప్తారు. మీరు పనులు చేసినప్పుడు కనీసం ఫొటోలు అయినా ఉండాలిగా..? మీరు చేసిన పనికి రాసిన రాతలకు పొంతన లేదు...పని చేసినట్లు ఫొటోల ఆధారాలూ లేవు..తప్పుడు లెక్కలు వేసి బిల్లులు చేశారు’’ అంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పీడీ గంగవరపు జోసఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 25 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకంలో చేసిన రూ.12,14,47,188 ల పనులు, పంచాయతీ రాజ్, ఇతర శాఖల ద్వారా చేసిన రూ.7,06,95,482లు కలపి మొత్తం రూ.19,21,42,670 విలువైన పనులపై సామాజిక తనిఖీ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఫీల్ట్ అసిస్టెంట్‌లు భారీ అవినీతికి పాల్పడినట్లు వెల్లడైంది. గతంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించారు. ఆ స్థానంలో కూటమి నేతలను ఫీల్డ్ అసిస్టెంట్‌లుగా నియమించారు. అధికారం మాది..ఇక మమ్మల్ని అడిగేదెవరకున్నారేమో కానీ ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టీఏలు చేతివాటం ప్రదర్శించారు. సామాజిక తనిఖీల్లో వారి అవినీతి బట్టబయలైంది. సామాజిక తనిఖీ అధికారులు డోర్ టూ డోర్ ఎంక్వయిరీ చేసి వారి అవినీతిని తూర్పారబట్టారు. జాబ్ కార్డులు అప్‌డేట్ లు చేయలేదు. పని ప్రదేశాల్లో టెంట్‌లు, మెడికల్ కిట్‌లు, వంటి సౌకర్యాలు కల్పించలేదు. అన్నీ కల్పించినట్లు రాసుకుని బిల్లులు చేసుకున్నారు. పనుల కొలతలు, రోడ్డు పనులు తనిఖీలు చేసిన నివేదికను ప్రజా వేదికలో చదివి వినిపించారు. ఉపాధి పనులు చేసిన చోట పనికి ముందు ఫొటోలు, పని తరువాత ఫొటోలు తీసి పెట్టలేదని పనులు చేసేటప్పుడు మాత్రమే ఫొటోలు పెట్టారని చెప్పారు. పనులు వద్ద వర్క్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. ప్రతి పనిలో 10 నుంచి 36 శాతం వరకు కొలతలు తేడాలు ఉన్న పనులు అధికంగా ఉన్నాయి. అధిక మొత్తంలో పనులు చేసినట్లు నమోదు చేసి డబ్బులు డ్రాచేశారు. చేసిన పనుల కొలతలు పెంచి బిల్లులు చేశారు. గ్రావెల్ రోడ్లకు లోకల్ గ్రావెల్ తోలి పనులు నాసిరకంగా చేశారు. మస్టర్‌లకు సంతకాలు, వేలు ముద్రలు లేకుండా పేమెంట్లు చేసినట్లు రాసుకున్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్‌లకు పనులు కల్పించి పేమెంట్‌లు చేశారు. రైతులకు తెలియకుండా వారు పనులు చేసినట్లుగా మస్టర్‌లు వేసి వారి ఖాతాల్లో పనులు చేయకుండానే డబ్బులు వేసి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. పనికి వెళ్లకుండా పేమెంట్‌లు వేసి ఆ తరువాత వారికి తెలియజేసి వారి వద్ద డబ్బులు తీసేసుకున్న ఎన్నో సంఘటనలు ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వేలో వెల్లడైంది. కొన్ని పుస్తకాల్లో పనులు చేసిన వారి సంతకాలు లేకుండా అన్నీ ఒకే వేలిముద్రలు వేసినట్లు గుర్తించారు. ఈ పనులపై టీఏ, ఎఫ్‌ఏలను ప్రశ్నించగా కొందరు రైతులు దున్నుకున్నారని, మరి కొన్ని వర్షాలకు కొట్టుకు పోయాయని పొంతన లేని సమాధానం ఇచ్చారు. పనులు చేసినప్పుడు ఫొటోలు ఇవ్వండని అడగ్గా మౌనమే సమాధానమైంది. సాయంత్రం వరకు 6 పంచాయతీలకు చెందిన వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో సామాజిక తనిఖీ ప్రోగ్రాం అధికారి పీ ఈశ్వరరావు, ఎస్‌ఆర్పీ నాగరాజు, ఏపీడీ సుబ్బారావు, డీఆర్బీ నాగరాజు ఎంపీపీ సుధారాణి, ఎంపీడీఓ వసంతరావునాయక్ పాల్గొన్నారు.