
9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పదోన్నతి పొందిన వారికి ఉత్తర్వులు అందజేశారు. అనంతరం ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పదోన్నతి అనేది మరింత బాధ్యత పెంచుతుందని చెప్పారు. ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు మరింత నిబద్ధతగా విధులు నిర్వహించి పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని కోరారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులకు గుడ్‌టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని, మాదక ద్రవ్యాలు, గంజాయి సేవనం వలన కలిగే అనర్థాలను వివరించి చెప్పాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో చురుగ్గా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఏఎస్సైగా పదోన్నతి పొందిన వారిలో సుభాన్ సాహిబ్ (బాపట్ల జిల్లా), కె.మురళీధర్ (నెల్లూరు జిల్లా), ఎస్‌ఆర్ ఖాశీం షరీఫ్ (తాళ్లూరు పీఎస్), షేక్ జిల్లా సాహెబ్ (బాపట్ల జిల్లా), ఐవీ శ్రీనివాసరావు (మార్కాపురం రూరల్), షేక్ బాజి బాబు (త్రిపురాంతకం పీఎస్), ఎస్కే ప్రవీణ్ షా (డీసీఆర్బీ ఒంగోలు), సీహెచ్ హెప్సీ రాణి (డీసీఆర్బీ ఒంగోలు), వి.కోటేశ్వరరావు (బాపట్ల జిల్లా) ఉన్నారు.