
చలం రచనలు ఆదర్శనీయం
ఒంగోలు టౌన్: సమాజంలో మహిళ గురించి మాట్లాడటానికి భయపడే రోజుల్లోనే వందేళ్ల క్రితమే మహిళలకు పురుషులతో సమానత్వ హోదా కల్పించాలని చలం చర్చించాడని ప్రభవ వ్యవస్థాపకురాలు చంద్రలత చెప్పారు. పీవీఆర్ ఉన్నతపాఠశాల ఆవరణలో జరుగుతున్న పుస్తక మహోత్సవం 6వ రోజు మాదాల రంగారావు సాహిత్య వేదికలో బుధవారం చలం రచించిన ‘సీ్త్ర’ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్రకి శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వండి, ఆమెకు మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వండి, ఆమెకు హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వండని చలం చెప్పిన మాటలను గుర్తు చేశారు. అప్పటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా సీ్త్ర స్వేచ్ఛ గురించి పరదాలను తెగతెంపులు చేశారని చెప్పారు. ఆనాడు చలం చర్చించిన విషయాలు నేటికీ సజీవంగా ఉన్నాయని, భావి తరాలు చలాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. నరసం రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ చలం రచనలు ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయని చెప్పారు. రచయిత కాట్రగడ్డ దయానంద్ చలం రచనల గురించి విళ్లేషించారు. కార్యక్రమాన్ని వల్లూరు శివ ప్రసాద్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు చిన్నారుల కోసం నిర్వహించిన కథల పోటీలో 80 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.