విలపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

విలపింఛెన్‌

Aug 19 2025 5:10 AM | Updated on Aug 19 2025 5:10 AM

విలపింఛెన్‌

విలపింఛెన్‌

దివ్యాంగుల పింఛన్లలో కూటమి ప్రభుత్వం కోత రీ వెరిఫికేషన్‌ పేరుతో దివ్యాంగులకు ఇక్కట్లు జిల్లాలో 9 వేలకు పైగా పింఛన్లు తొలగిస్తున్నట్లు నోటీసులు లబోదిబోమంటున్న దివ్యాంగులు కూటమి ప్రభుత్వం తమ పొట్టకొడుతోందని ధ్వజం కలెక్టర్‌ గ్రీవెన్స్‌, సదరం సెంటర్లకు పోటెత్తిన దివ్యాంగులు

ఈమె పింఛన్‌కు అనర్హురాలట..

దివ్యాంగులు

అర్హత ఉన్నా పింఛన్లు తొలగిస్తున్నట్లు నోటీసులు వచ్చాయంటూ కలెక్టరేట్‌కు మీకోసంలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన దివ్యాంగులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా...అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడటం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు అప్పటి వరకు ఉన్న రూ.3 వేల పింఛన్‌ను అధికారంలోకి రాగానే రూ.6 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన తరువాత దివ్యాంగుల పింఛనును రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లే పెంచి లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పెట్టేందుకు రంగం సిద్ధం చేశాడు. దివ్యాంగులను తిరిగి వైద్యులచే పరీక్షలు నిర్వహించేందుకు రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను గత ఏడాది డిసెంబర్‌ నుంచి ప్రారంభించారు. రీ వెరిఫికేషన్‌ పేరిట చేపట్టిన ఆరోగ్య పరీక్షల్లో వేలాది మందిని అనర్హులుగా చేసే కుట్రకు తెరలేపారు. రీ వెరిఫికేషన్‌లో అంగవైకల్యం 90 శాతం, 80 శాతం ఉన్నా అడ్డంగా ఆ శాతాలకు కోత విధించి దివ్యాంగుల పింఛన్లకు కోత పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందుకుగాను ఏరియాల వారీగా సదరమ్‌ క్యాంపులు నిర్వహించి పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేయించారు. జిల్లా వ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్‌ తీసుకుంటున్న వారు 33,310 మంది ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు.

పింఛనుకు అనర్హులని నోటీసులు జారీ...

సదరమ్‌ క్యాంపుల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన మీదట కొంతమందికి దివ్యాంగ పింఛను తీసుకోవటానికి మీరు అనర్హులంటూ ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులకు నోటీసులు పంపుతున్నారు. ఈ విధంగా నోటీసులు జిల్లాలో దాదాపు 9 వేల మంది వరకు వచ్చాయన్నది సమాచారం. దీంతో బెంబేలెత్తిన దివ్యాంగులు ఆ నోటీసులు తీసుకొని సోమవారం ఒంగోలులో నిర్వహిస్తున్న కలెక్టర్‌ మీ కోసం కార్యక్రమానికి పోటెత్తారు. 90 శాతం, 85 శాతం అంగవైకల్యంతో ఇప్పటి వరకు పింఛను పొందుతుంటే రీ వెరిఫికేషన్‌లో సాధారణ వైకల్యం మాత్రమే ఉందని, అందుకు దివ్యాంగుల పింఛనుకు అనర్హులని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా నోటీసులు జారీ చేశారు. దాంతో దివ్యాంగులు లబోదిబోమంటూ జిల్లా అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ నెల 27 నాటికి తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దాంతో సెప్టెంబర్‌లో పింఛను రాదేమోనని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు.

వీల్‌చైర్‌లో కూర్చున్న ఈ యువతి పేరు చిమట త్రివేణి(18). తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెం. ఈమెకు రెండో ఏట నుంచే పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. కనీసం బాత్‌రూంకు వెళ్లాలన్నా తల్లి తీసుకెళ్లాల్సిందే. ఈమెకు గతంలో వైద్యులు 90 శాతం అంగవైకల్యం ఉందని సదరమ్‌లో సర్టిఫికెట్‌ ఇచ్చారు. అప్పటి నుంచి దివ్యాంగురాలిగా పింఛను పొందుతోంది. అయితే ఇటీవల జరిపిన రీ వెరిఫికేషన్‌లో త్రివేణిది సాధారణ వైకల్యం అని పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్టిఫై చేశారు. దాంతో త్రివేణి పింఛనుకు అనర్హురాలని నోటీసులు పంపారు. దాంతో నాగంబొట్లవారిపాలెం నుంచి మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చేందుకు రిక్షాలో తల్లి అంజమ్మ ఒంగోలుకు తీసుకొచ్చింది. వీల్‌చైర్‌లో కలెక్టరేట్‌లోకి తీసుకెళ్లి మీకోసంలో అర్జీ ఇచ్చి వచ్చింది.

ప్రభుత్వ కుట్రలకు దివ్యాంగులు బలైపోతున్నారు. పింఛన్లు పెంచి ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏదో ఒక వంక పెట్టి పింఛన్లను అడ్డగోలుగా తొలగిస్తోంది. రీవెరిఫికేషన్‌ పేరుతో 90 నుంచి 80 శాతం వైకల్యం ఉన్నా..కోత పెట్టి దివ్యాంగ పింఛన్‌ తీసుకునేందుకు అనర్హులంటూ లబ్ధిదారులకు నోటీసులు పంపుతోంది. ఇప్పటికే జిల్లాలో 9 వేల మంది దివ్యాంగ పింఛన్‌దారులకు ఇలా అనర్హులంటూ నోటీసులు పంపించారు. దీంతో వారంతా తమ నోటిదగ్గర కూడు తీసేస్తున్నారంటూ లబోదిబోమంటున్నారు.

మీకోసంలో జిల్లా అధికారికి తమ సమస్యలను వివరిస్తున్న దివ్యాంగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement