
సెప్టెంబర్ నుంచి సాగుకు సాగర్ జలాలు
యర్రగొండపాలెం: ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాలువ నుంచి జిల్లాకు సెప్టెంబర్ మొదటి వారంలో సాగు నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు దర్శి ఈఈ ఎం.రామకృష్ణ తెలిపారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నీరున్నా నిష్ఫలం’ వార్తకు ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం నిండుగా ఉండటం వలన సముద్రం పాలయ్యే నీటిని కాలువల ద్వారా డైవర్ట్ చేస్తారని, ఈ నీటిని నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ చెరువులు నింపుకోవడానికి, ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి వదులుతున్నామన్నారు. వరద నీరు వచ్చే సమయంలో రైతుల విజ్ఞప్తి మేరకు అవసరమైన సాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. కాలువల ద్వారా వదిలే వరద నీటిపై పూర్తిగా ఆధారపడి సాగు చేయవద్దని, ప్రస్తుతం కాలువల్లో వదిలే నీరు వరద నీటి మళ్లింపులో భాగమేనని ఆయన వివరించారు.