
నవోదయలో క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్
తర్లుపాడు: మండలంలోని కలుజువ్వలపాడు పీఎం శ్రీ జవహర్ నవోదయ–2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 కళాశాలలకు సంబంధించిన క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్–2025ను ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రకృతిని కాపాడుకుంటూ స్వచ్ఛభారత్ నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించాలని, విలువలతో కూడిన విద్యలో రాణిస్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. కళల గురించి విద్యార్థులకు సాధనా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే మధుసూదన్ శాస్త్రి వివరించారు. గుంటూరుకు చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్‌కు చెందిన సిబ్బంది బీ సురేష్‌బాబు, ప్రభాకర్ రావు, జయశంకర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, రెండు రాష్ట్రాలలోని నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో జరుగుతున్న జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో ఇచ్చిన పోస్టులు కాకుండా ఇంకా మిగిలిపోయిన టీచర్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 20 వేల పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉండగా 6100 పోస్టులు భర్తీ చేస్తున్నారని, మిగిలిన 14 వేల పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. గ్రూప్ వన్, గ్రూప్ 2, బ్యాక్‌లాగ్ పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంటులో ఉన్న 29 వేల పోస్టులను సాధ్యమైనంత తొందరగా భర్తీ చేయాలన్నారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో వాన్‌పిక్, నిమ్జ్, దొనకొండ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు. కేవీ పిచ్చయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పి.కిరణ్, పి.నరేంద్ర, జి.కొండయ్య, మోహన్, సురేష్ పాల్గొన్నారు.

నవోదయలో క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్