
‘నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర’ పుస్తకావిష్కరణ
ఒంగోలు టౌన్: నగరంలో జరుగుతున్న మూడో పుస్తక మహోత్సవం సోమవారం 4వ రోజుకు చేరుకుంది. విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రచురించిన డాక్టర్ మహీధర నళినీ మోహన్ రచించిన రాకెట్ కథ, నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర పుస్తకాలను విశ్రాంత ఐఏఎస్ అధికారి హరి నారాయణ చక్రవర్తి ఆవిష్కరించారు. 16వ శతాబ్దంలో ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం పుస్తకాన్ని విడుదల చేశారు. తిరుమల రామచంద్ర రచించిన మనలిపి పుట్టుపూర్వోత్తరాలు, నుడి–నాడుడి పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక అధ్యక్షుడు వల్లూరు శివప్రసాద్, విశాలాంధ్ర బుక్ హౌస్ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు విడుదల చేశారు. తిరుమల రామంద్ర శత జయంతి సందర్భంగా ఈ పుస్తకాలను ఆవిష్కరించినట్లు మనోహర్ నాయుడు తెలిపారు. పీవీఆర్ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నపిల్లల కథలు, చందమామ కథల పుస్తకం, కామిక్స్ తదితర పుస్తకాలతో పాటుగా జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న సైన్స్ కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మట్టి బొమ్మలతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో సుమారు 70 మందికి పైగా విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు. వివిధ రకాల మట్టిబొమ్మలు, ఆట వస్తువులను తయారు చేసిన చిన్నారులు తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. ఈ కార్యక్రమం చిన్నారులను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన పలువురు రచయితలు, మేధావులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.