
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పరవళ్లు తొక్కిన తీగలేరు వాగు జలదిగ్భందంలో గంటవానిపల్లె లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచన విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 1912 లేదా 9440817491
ఒంగోలు సబర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం జిల్లాలో 15.3 మి.మీల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా సోమవారం కూడా పశ్చిమ ప్రాంతంలో అక్కడక్కడా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఆదివారం అత్యధికంగా అర్థవీడు, రాచర్ల మండలాల్లో వర్షం కురిసింది. అర్థవీడులో 45 మిల్లీ మీటర్లు, రాచర్లలో 43.8 మిల్లీ మీటర్లు, మార్కాపురంలో 32.6, తర్లుపాడులో 29.4, కంభంలో 27.6, పెద్దారవీడు 26.8, బేస్తవారిపేటలో 22.8, వెలిగండ్లలో 21, పుల్లలచెరువులో 20 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మిగతా మండలాల్లో 5 నుంచి 19 మిల్లీ మీటర్ల వరకు వర్షం కురిసింది.
జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ...
అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. అందులో భాగంగా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు సూచనలు జారీ చేశారు.
విద్యుత్ శాఖ సిబ్బంది సెలవులు రద్దు:
భారీ వర్షాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి పడి ఉంటే, వాటిని తాకవద్దని, వెంటనే 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ 1912 లేదా ఎల్.ఎం.సి 9440817491 నంబర్‌కి కాల్ చేయాలని సూచించారు.
నల్లమలలో భారీ వర్షాల
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మండల పరిధిలోని తీగలేరు పొంగటంతో గంటవానిపల్లి వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన నేల బారు చప్టాపై నీరు భారీగా ప్రవహిస్తుండంతో గతంలో చప్టాకు చేసిన మరమ్మతులు పూర్తి స్థాయిలో కొట్టుకు పోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గంటవానిపల్లె ప్రజలు బయటకు రాలేక అత్యవసర పనులు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. గ్రామస్తుల చిరకాల స్వప్నమైన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూల్, గుంటూరు రహదారి నుంచి తీగలేరు మీదుగా గంటవానిపల్లి గ్రామానికి నిర్మించే ఈ బ్రిడ్జికి సంబంధించి రూ.270 కోట్లు మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసిందని, అయితే ఇంత వరకు బ్రిడ్జి నిర్మాణం మొదలు కాలేదని గంటవానిపల్లె గ్రామస్తులు వాపోతున్నారు.
ప్రవహిస్తున్న జంపలేరు వాగు
అర్ధవీడు: నల్లమల అడవుల్లో వారం నుంచి కురుస్తున్న వర్షాలకు బుగ్గ వాగుకు నీరు చేరింది. నాయినిచెరువు నిండు కుండలా నిండి అలుగు రావడంతో జంపలేరు జలకళ సంతరించుకుంది. నాయినిచెరువు కింది భాగంలో ఉన్న పైచెరువు, బొల్లుపల్లి చెరువుకు కూడా నీరు చేరింది. ఇలాగే 10 రోజుల పాటు బుగ్గ నీరు ప్రవహిస్తే అర్ధవీడు చెరువు కూడా నిండుకుండలా జలకళ సంతరించుకుంటుందని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్