
లారీని ఢీకొని..
సింగరాయకొండ:
ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మోటారు సైకిల్‌తో ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం సింగరాయకొండ మండల పరిధిలోని విమానాల రన్‌వేపై వెంకటేశ్వర కళ్యాణ మండపం సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన ఇత్తడి జయప్రకాష్ (38) జాతీయ రహదారిపై బీకే త్రషర్స్ కంపెనీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో పెట్రోల్ బంకు నుంచి మండలంలోని మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో నివసిస్తున్న తన యజమాని ఇంటికి బయలుదేరాడు. హెల్మెట్ ధరించి మోటారు సైకిల్‌పై విమానాల రన్ వేపై వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా లారీని రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద ఆపే ప్రయత్నం చేశాడు. గమనించని జయప్రకాష్.. లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. అతని హెల్మెట్ ముందు భాగం పగిలి అవతల పడగా, మోటారు సైకిల్ అదుపుతప్పి దూరంగా పడింది. ఈ ప్రమాదంలో జయప్రకాష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే అతను మరణించాడు. హెల్మెట్ ధరించినప్పటికీ లాక్ పెట్టుకోకపోవటంతో ప్రమాదం జరిగినప్పుడు అది ఎగిరిపడిపోయి జయప్రకాష్ నుదిటికి గాయాలైనట్లు తెలుస్తోంది. జయప్రకాష్ భార్య దివ్యవాణి నందనవనంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తుండగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. దివ్యవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర వివరించారు. మృతదేహానికి ఒంగోలు జీజీహెచ్‌లో మంగళవారం పోస్టుమార్టం చేయనున్నట్లు బంధువులు తెలిపారు.
పొదిలి మండలంలో మరో యువకుడు...
పొదిలి రూరల్: ఆగి ఉన్న లారీని ఢీకొని బైక్‌పై వెళ్తున్న యువకుడు మృతిచెందాడు. ఒంగోలు–కర్నూలు రహదారిపై పొదిలి మండలంలోని తలమళ్ల–అగ్రహారం గ్రామాల మధ్య పవర్ గ్రిడ్ వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పొదిలి మండలంలోని మాదాలవారిపాలేనికి చెందిన దాసరి మధు (24) మర్రిచెట్లపాలెంలోని గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. రోజూ మాదిరిగా తన పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా, పొదిలి నుంచి ఒంగోలు వైపు వెళ్తూ పవర్‌గ్రిడ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధు తలకు తీవ్రగాయాలవడంతో స్థానికులు వెంటనే పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు.
మోటారు సైకిల్‌పై వెళ్తున్న యువకుడు మృతి
హెల్మెట్ ధరించినా లాక్ పెట్టకపోవడంతో తలకు గాయాలై దుర్మరణం

లారీని ఢీకొని..

లారీని ఢీకొని..

లారీని ఢీకొని..