
మేసీ్త్రలను తొలగించి పొట్టకొట్టారు
ఒంగోలు సబర్బన్: స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న 55 మంది మేసీ్త్రలతో కలిపి దాదాపు 110 మంది పారిశుధ్య కార్మికులను అక్రమంగా తొలగించి పొట్టకొట్టారంటూ సోమవారం స్థానిక ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. సీఐటీయూ ఒంగోలు నగర అధ్యక్షుడు టి.మహేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు కోల్పోయిన మేసీ్త్రలు, పారిశుధ్య కార్మికులు జేసీని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమను తొలగించి నూతనంగా కూటమి పార్టీల నాయకులు చెప్పిన వారికి ఉద్యోగాలిచ్చారని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 15 సంవత్సరాలకుపైగా ఒంగోలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని చెప్పారు. తాము చేసిన తప్పు ఏమిటని అడిగినా మున్సిపల్ కమిషనర్ చెప్పడం లేదన్నారు. మేసీ్త్ర వ్యవస్థ ఇక నుంచి ఉండదని మాత్రమే చెప్పారన్నారు. అలాంటప్పుడు నూతనంగా తీసుకున్న వారు పారిశుధ్య పనులు చేయటం లేదని, మేసీ్త్రలుగానే పనిచేస్తున్నారని జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దేవస్థాన స్థలంలో
మున్సిపల్ అధికారులకు ఏం పని.?
మార్కాపురం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం పడమట వైపున్న ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇచ్చేందుకు మున్సిపాలిటీ అధికారులు టెండర్లు పిలవడం అన్యాయమని మార్కాపురానికి చెందిన పురోహితుడు శ్రీకంఠం నారాయణాచార్యులు జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానానికి ఆమోదించారన్నారు. దేవస్థానానికి సంబంధించిన స్థలంలో మున్సిపల్ అధికారులకు అద్దెకిచ్చే హక్కు ఎవరిచ్చారన్నారు. ఈ విధానం చూస్తుంటే కొందరు కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు కలిసి శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థాన స్థలాలను, దేవస్థానం మొత్తాన్ని కూడా అమ్మేదానికి వెనకాడేలా లేరని స్పష్టమవుతోందన్నారు. వెంటనే ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు.
సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే వేధిస్తున్నారు...
ఒంగోలులోని కొప్పోలు రోడ్డులో రైల్వేస్టేషన్‌కు ఉత్తరం వైపు వైఎస్సార్ కాలనీలో సొంతంగా స్థలం కొనుక్కుని ఇంటి నిర్మాణం చేసుకుంటే అక్కడ కొంతమంది డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నాని మీ కోసం కార్యక్రమంలో జేసీకి ఓ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు చేశారు. యూనియన్ బ్యాంక్ టంగుటూరు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న బేలాళ రమేష్ వైఎస్సార్ కాలనీ 3వ అడ్డరోడ్డులో 23.5 గదుల స్థలం కొన్నాడు. అందులో రూ.5,30,000తో మున్సిపాలిటీ నుంచి అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు. స్థానికంగా ఉన్న బొజ్జా వీరయ్య అనే అతను కబ్జాచేసి తనను ఇంటికి వెళ్లనీయకుండా రోడ్డుకి అడ్డంగా రేకుల షెడ్డు ఏర్పాటు చేసి ఇబ్బందులు పెడుతున్నాడన్నారు. అదేవిధంగా తూర్పు వైపున ఉన్న వీడీఓ కాలనీ వైపు రేకుల షెడ్డు వారితో మాట్లాడుకుని అక్కడ రోడ్డుకి అడ్డంగా గుంత తీశారన్నారు. అదేంటని అడిగితే వీడీఓ కాలనీ ప్రెసిడెంట్ రూ.5,00,000 డిమాండ్ చేస్తున్నాడన్నారు. రెండోవైపు వాళ్లు రూ.4,00,000 డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయమై అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా ఉందన్నారు. వారి బారి నుంచి తనను కాపాడాలని జేసీ గోపాలకృష్ణను వేడుకున్నాడు. మీ కోసం కార్యక్రమంలో జేసీతో పాటు డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్‌రెడ్డి, కుమార్, జాన్సన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఏళ్ల తరబడి పనిచేస్తున్నామన్నా
పట్టించుకోవడం లేదు
పనిచేస్తున్న వాళ్లని కాదని కొత్తగా 35 మందిని తీసుకున్నారు.
ఒంగోలు నగరపాలక సంస్థలో అడ్డగోలు
వ్యవహారాలపై మీ కోసం కార్యక్రమంలో
జేసీకి ఫిర్యాదు