
రోడ్డుపై రాకపోకల అడ్డగింత
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): సంతనూతలపాడులోని ఎంపీడీఓ కార్యాలయం వెనుకవైపు రోడ్డుపై కొందరు వ్యక్తులు రాకపోకలను అడ్డుకుని స్థానికులను ఇబ్బందులు గురిచేస్తుండటంతో సోమవారం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌శాఖ స్పందన కార్యక్రమంలో ఎస్పీ దామోదర్‌కు బాధితుడు ఇనగంటి సుబ్రహ్మణ్యం అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. బొద్దులూరి యల్లమంద అనే వ్యక్తి హైకోర్ట్ ఆర్డర్ కూడా లెక్కచేయకుండా ఆ రోడ్డులో ఉంటున్న వారు రాకపోకలు సాగించకుండా అడ్డంగా వాహనాలు నిలిపి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై గతంలో జరిగిన తగాదా నేపథ్యంలో జిల్లా కోర్టులో కేసు వేయగా, కోర్టు టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చి రాకపోకలకు అడ్డంకులు కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఇటీవల హైకోర్ట్‌లో విచారణ జరగ్గా, రహదారికి అడ్డంపెట్టిన వాహనాలు తొలగించాలని సంతనూతలపాడు పోలీసులను కోర్టు ఆదేశించిందని తెలిపారు. పోలీసులు కూడా యల్లమంద కుటుంబానికి రోడ్డుపై పార్కింగ్ చేయరాదని చెప్పి వాహనాలు తొలగించారన్నారు. కానీ, పోలీసుల మాట కూడా హైకోర్ట్ ఆదేశాలను కూడా ఉల్లంఘించి మరుసటి రోజే మళ్లీ రోడ్డుకి అడ్డంగా యల్లమంద బైకులు పెట్టిస్తున్నాడని సుబ్రహ్మణ్యం ఎస్పీకి వివరించారు.
తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులు...
ఇటీవల రాఖీ పండుగ రోజు తన అక్క రాఖీ కట్టడానికి సన్నిహితులు, స్నేహితులతో తమ ఇంటికి రాగా, యల్లమంద ఉద్దేశపూర్వకంగా వారిని బూతులు తిట్టాడని సుబ్రహ్మణ్యం ఎస్పీ ఎదుట వాపోయాడు. పైగా, పోలీస్ స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదులు చేసి బెదిరిస్తున్నాడన్నారు. తమ వీధి వైపుగానీ, తమ ఇంటివైపుగానీ ఎవరైనా వస్తే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నాడని తెలిపారు. పోలీసుల విచారణలో తాము చూపించిన ఫొటోలు, వీడియోలు ఉన్నా కూడా తమ స్నేహితులపైనే బైండోవర్ రాశారని సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలున్నా కూడా పోలీసు రక్షణ లేకుండా తమను ఒంటరివాళ్లను చేసి తప్పుడు కేసులు పెడతామని భయపెడుతున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగకుండా తక్షణం చర్యలు తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీకి సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.